ఆయన ఆర్‌ఎస్‌ఎస్ బొమ్మే: సిద్ధరామయ్య
బెలగావి : కర్నాటకలో సిఎం బస్వరాజ్ బొమ్మై డబ్బులిచ్చి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారని, ఆయన ఎన్నికైన సిఎం కాదని కర్నాటక కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య ఆరోపించారు. రాష్ట్ర మాజీ సిఎం, అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత అయిన సిద్ధరామయ్య బిజెపి అగ్రనాయకత్వపు వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలకు దిగారు. రాష్ట్ర సిఎం పదవిని బొమ్మై కొనుక్కున్నారని, ఈ విధంగా ఆయన బొమ్మసిఎం అయ్యారని అన్నారు. ఒక్కరోజు క్రితమే రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ తనకు సిఎం పదవి కావాలంటే రూ 2500 కోట్లు ఇస్తారా? అని కొందరు అడిగారని మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన ఆయన సంచలన వ్యాఖ్యలకు దిగారు. పాటిల్ మాటల దశలోనే ఇప్పుడు మాజీ సిఎం బిజెపిపై ఆరోపణలకు దిగారు. సిఎం పదవి చాలా విలువైనది.
ఇప్పుడు ఇక్కడి వ్యవహారాలలో దీనిని ఎన్నికైన వారికి కట్టబెట్టడం లేదని, కేవలం పై స్థాయిలో నేతలు డబ్బులు తీసుకుని ఈ పదవిని అమ్మేస్తున్నారని రాజకీయ దిగ్గజంగా పేరొందిన సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం ఆశీస్సులతోనే బొమ్మై సిఎం అయ్యారని, ఈ విధంగా ఆయన చివరికి ఆయన పార్టీకి కానీ ప్రజలకు కానీ జవాబుదారి అనుకోవడం లేదని కేవలం సంఘ్‌పరివార్ కనుసన్నలలో మెదలుతున్నారని సిఎల్‌పి నేత అయిన సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఇక ఈ సిఎం పదవికి ఢోకా లేదని ఆదివారం ఆయన ఇక్కడ ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు. బిజెపి ప్రభుత్వం నాలుగేళ్ల అధికారంలో ఇంతవరకూ అవసరార్థులకు ఒక్క ఇల్లైనా కట్టించలేదని ఆరోపించారు. తమ హయాంలో ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు 15 లక్షల ఫక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని అన్నారు.