సిరియాలో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్లు రాజధాని డమాస్కస్ నగరంలోకి ప్రవేశించారు. దీంతో బషర్ అల్ అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించడానికి ముందే ఆయన గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో సిరియాలో గత 24 ఏళ్లుగా ఉన్న అస్సాద్ పాలనకు, 50 ఏళ్లుగా సాగుతున్న అతడి కుటుంబ పాలనకు ముగింపు పడింది. తిరుగుబాటు గ్రూపుల బలగాలు కీలకమైన నగరాలను ఆక్రమించుకుంటూ క్రమంగా రాజధాని డమాస్కస్ లోకి అడుగుపెట్టాయి. ఈ దళాలకు టర్కీ మద్దతు ఉన్న విషయం తెలిసిందే.
తిరుగుబాటు దళాలకు శాంతియుతంగా అధికార మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిరియా ప్రధాని ముహమ్మద్ ఘాజీ జలాలి ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.