మానవ హక్కుల దృక్పథానికి మనిషి అన్న భావన కేంద్రం. మనిషిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరికీ ఉండవలసిన హక్కులు మానవ హక్కులు. ఇవి సమాజంలో కొందరికి ఉన్నంతగా ఇతరులకు లేవు. లేకపోవ డానికి వర్గం, కులం, జెండర్, ప్రాంతం, జాతి, మతం మొదలైన అనేక కారణాలు ఉన్నాయి. తమ హక్కుల గురించి చైతన్యవంతులవుతున్న ఒక్కొక్క ప్రజాస మూహం మనిషై పుట్టినందుకు ప్రతి ఒక్కరికీ ఉండవలసిన హక్కులు, అని మానవ హక్కుల భావనను సులభంగా సొంతం చేసుకోగలుగుతున్నారు. స్త్రీల హక్కులు మానవ హక్కులేనని, దళిత హక్కులు మానవ హక్కులే నని, ఖైదీల హక్కులు మానవ హక్కులే అని, పిల్లల హక్కులు మానహక్కులేనని నినదించగలుగుతున్నారు – బాలగోపాల్
మరో వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంఘాలు, ప్రభుత్వాలు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10న జరుపుకోబోతున్నారు. సరిగ్గా డిసెంబరు 1వ తేదీనాడు తెల్లవారుజామున తెలంగాణలోని ములుగు జిల్లా, ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలోని, చలపాక అడవి ప్రాంతంలో ఒక భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దానిలో ఏడుగురు మావోయిస్టులు ‘ఎదురు కాల్పుల’లో మరణించారు. వీరందరూ 24 సంవత్సరాల లోపు ఉన్న యువతీ, యువకులే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా వాళ్ళు ఘనంగా సంబరాలు చేసుకున్న సందర్భంలోనే, ఈ ఎన్‌కౌంటర్‌ను తెలంగాణ ప్రజలకు వారి ఏడో హామీగా ఇచ్చారా అనే సందేహం కలగటం సహజమే.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 16 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చారని హక్కుల సంఘాలు నిర్ధారించాయి. గత 11 నెలల కాలంలో 2024 జనవరి నుండి ఈ నెల డిసెంబర్ ఒకటో తేదీ వరకు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, బస్తర్, తెలంగాణ మొదలైన ప్రాంతాల్లో 215 మందికి పైగా మావోయిస్టులను ఎదురు కాల్పుల పేరుతో చంపేయడం జరిగింది. వీరిలో చాలా మంది ఆయా ప్రాంతాల్లోని సాధారణ పౌరులు, గిరిజనులే అని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గతం నుండీ వున్న ఎదురు కాల్పుల హత్యలు, హక్కుల అణిచివేతల చరిత్ర చాలా పెద్దదే. ఎదురు కాల్పులు అన్నవి నూటికి 99 శాతం ఏకపక్షంగా పోలీసులు జరిపేవే అనే నమ్మకం గత అనుభవాల వల్ల ఉన్న కారణంగానేమో, ఇక్కడి పౌరహక్కుల సంఘాలు ఈ ఘటనపై విచారణకు హైకోర్టును ఆశ్రయించాయి.
గత కొంతకాలంగా బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది నియంతృత్వ పాలన, ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు, ఎన్‌కౌంటర్ హత్యలు జరుగుతున్నాయి అని ఆందోళన వెలిబుచ్చుతున్నది. కాగా గతంలో తాము అధికారంలో వున్నప్పుడు కూడా ఇల్లాంటి విధానాలనే తాము సైతం అమలుపరిచిన విషయం నేడు వారు మరచిపోయినట్లున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వీధులలో ప్రదర్శనలు, పోరాటాలు, ధర్నాలు, మిలియన్ మార్చ్‌లు నిర్వహించిన ఈ పార్టీనే, అధికారంలోకి రాగానే సభలకు, ప్రదర్శనలకు అనుమతి నిరాకరించింది.హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తివేసింది. హక్కుల చైతన్యం ఎక్కువగానే వుండే తెలంగాణ పౌర సమాజం, సంఘాలు కోట్లాడి మరీ, నిరసన తెలిపే ధర్నా చౌక్‌ను మళ్ళీ పునరుద్ధరించుకోగలిగారు. ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీ కూడా అక్కడే తమ నిరసనలు తెలుపుకోవాల్సి రావడం మరో సంగతి. హక్కుల కోసం నిలబడటం అన్నది అధికారంలో వున్నా, లేకున్నా పాటించాల్సిన విలువ అన్నది వీరికైనా, వారికైనా పట్టే విషయం ఏమీ కాదు.
గత శతాబ్ది కాలంలో ప్రపంచం రెండు భీకరమైన ప్రపంచ యుద్ధాలను, అంతులేని హింసను చూసింది. కోట్లాది మంది ప్రజలు ఆ యుద్ధాల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీలో నాజీ హిట్లర్ ప్రభుత్వం యూదుల మీద చేసిన దారుణమైన హింసను, మానవ హననాన్ని, అది సృష్టించిన బీభత్సాన్ని ఇప్పటికీ సమాజం మర్చిపోలేదు. ఆ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి మరింత స్పష్టంగా మానవ హక్కులను నిర్వచించేందుకు 1946లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు, రాజకీయ నేపథ్యాలకు చెందిన 18 మంది సభ్యులతో ఎలియనోర్ రూజ్‌వెల్ట్ అధ్యక్షతన ప్రత్యేక యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు అయింది. డిసెంబర్ 10 న ‘ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని’ ప్రపంచం అంతటా, వ్యక్తులు, వివిధ సంఘాలు, ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి జరుపుకుంటాయి.
మానవ హక్కుల డిక్లరేషన్‌ను ప్రకటించిన 75 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూనే వున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడని దేశం ప్రపంచంలో ఒక్కటన్నా లేదు. హక్కుల ఉల్లంఘనల పరిధి చాలా విస్తృతమైంది. అనేక దేశాల్లో రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా ఆ దేశపౌరులుగా, ప్రజలకు లభించే హక్కుల్ని అక్కడ అధికారంలో ఉండే ప్రభుత్వాలు స్వయంగా కాలరాయడం ఒకటైతే, సామాజిక అసమానతల కారణంగా మెజారిటీ పౌరులను కనీసం మానవులుగా, సాటి మనుషులుగా కూడా గుర్తించకపోవడం మరో అంశం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో బహుముఖ రూపాలలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది.
ప్రతి ఏటా హ్యూమన్ రైట్స్ వాచ్ అనే అంతర్జాతీయ సంస్థ మానవ హక్కుల నివేదికను విడుదల చేస్తుంది. 2024 జనవరిలో అది 700 పేజీల నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 105 దేశాల్లో మానవ హక్కుల పరిస్థితి ఎట్లా ఉందో అది సమీక్షించింది. యుద్ధనేరాలు పెరగడం, ప్రజలు బలవంతంగా వారి నివాసాల నుండి వెళ్ళగొట్టబడటం, ఆయా దేశాలలో రాజ్యాంగపర హక్కులను కోల్పోవడం, మహిళలు, బాలలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నల్లజాతి ప్రజలు ఇలా వివిధ సామాజిక బృందాలకు చెందిన మనుషులపైన వివక్ష, హక్కులు అణిచివేత, హింస పెద్ద ఎత్తున సాగుతూనే వుంది. అంతేకాదు, సమాజపు అంచులకు నెట్టబడ్డ ప్రజల హక్కులకోసం కొట్లాడుతున్న సంఘాలపైనా, మానవ హక్కుల సంఘాలపైనా, కార్యకర్తల పైనా అణిచివేతలు, నిషేధాలు, చంపడాలు ప్రపంచమంతా జరుగుతున్నాయి.
అలాగే పత్రికా స్వేచ్ఛ హరించబడడం, నిజాలను వెలికి తీస్తున్న విలేకరులపై, పత్రికలపై దాడులు పెరగడం కూడా అంతటా జరుగుతూఉంది. ప్రపంచమంతటా ఆయా దేశాలలోని ప్రభుత్వాలు ఒక పక్క మానవ హక్కుల పత్రంపై సంతకం చేసి, మరోపక్క ఆ ప్రభుత్వాలే హక్కుల ఉల్లంఘనకు, అణిచివేతకు స్వయంగా పూనుకొంటూ ఉన్నాయి. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై జరుపుతున్న మానవ హననం, రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి హిట్లర్ చేసిన జెనోసాడ్ కంటే తక్కువది ఏమీకాదు. ఇప్పటికే 44 వేల మంది పౌరులు చంపబడ్డారు.
వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. 1,04,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. అనేక లక్షల మంది నిరాశ్రయులై, కాందిశీక శిబిరాలలో అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అనునిత్యం జరుగుతున్న బాంబు దాడుల్లో ఇళ్ళు, పాఠశాలలు, ఆసుపత్రులు కూల్చివేయబడ్డాయి. చివరికి మానవతా సహాయం కూడా బాధితులు అందకుండా అడ్డుకోవడం ఎంతో హేయమైన చర్య. ఇంత పెద్ద ఎత్తున పాలస్తీనాలో హింస, విధ్వంసం జరుగుతున్నా, దీనిని నివారించడానికి ప్రపంచమంతటా పౌరసమాజం, హక్కుల సంఘాలు చేస్తున్న ఆందోళనలే తప్ప, ఇజ్రాయెల్ చేస్తున్న హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడడానికి, యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితితో సహా, ఇతర దేశాలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఏమీ లేవు. ఇప్పుడీ యుద్ధం మధ్యప్రాచ్య దేశాలలోకి కూడా విస్తరించింది. ఉక్రెయిన్ లోనూ ఆరని కాష్టంలా యుద్ధం ఎంతోకాలంగా కొనసాగుతూనే వుంది. మన దేశం అంతటా కూడా మానవ హక్కుల ఉల్లంఘన ఎలాంటి జంకు, గొంకూ లేకుండా కొనసాగుతూనే ఉంది.అనేక ఏళ్లుగా కశ్మీర్లో, మణిపూర్‌లో, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రజలకు వారి రోజువారీ దినచర్యలో భాగంగా అయిపోయాయి. సభలు, సమావేశాలు పెట్టుకునేందుకు అనుమతి నిరాకరించడం, ఉపా చట్టాలు, అక్రమ అరెస్టులు, నిర్బంధం అణిచివేత, హక్కుల నిరాకరణ అన్నీ ప్రజాస్వామ్యం పేరిటే కొనసాగుతాయి.
కుల అణిచివేత, మహిళలు, పిల్లలపై హింస రెట్టింపు అయ్యాయి. రైతులు, కార్మికులు దుర్మార్గమైన వ్యవసాయ, కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చేసిన ఆందోళన పైన, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనపై ఎలాంటి అణిచివేత కొనసాగిందో తెలిసినదే. మైనారిటీల పట్ల వివక్షనే కాకుండా, దేశంలోని అనేక ప్రాంతాలలో మతపరమైన హింసాత్మక సంఘటనలు జరగటం, ముస్లింలపై దాడులు చేయడం సర్వసాధారణం అయింది. ‘బుల్డోజర్ న్యాయం’ పేరు తో చట్ట వ్యతిరేకంగా తమ ప్రత్యర్ధులపై దాడులు చేసేందుకు కొన్ని ప్రభుత్వాలే, కొన్ని రాష్టాల్లో స్వయంగాపూనుకున్నాయి. ఆర్థిక, అధికార, అంగబలం ఉన్నవాళ్లు కొద్ది మందే సమాజంలో తాము మాత్రమే అసలైన మనుషులం అనుకుంటారు. అలాంటప్పుడు ఆ మానవ సమాజంలో, మెజారిటీ ప్రజలకు ఎలాంటి హక్కులూ వుండకపోవడమే కాదు, అన్ని రంగాలలోనూ వివక్ష, ఆధిపత్య, అణిచివేత, సంబంధాలే వారి ఎడల అమలవుతాయి.
తమకు హక్కులు లేకపోవడం గురించో లేదా కొందరికే ఆధిపత్యం, అధికారం ఎందుకు వున్నాయనో ప్రశ్నిస్తే, అలా ప్రశ్నించినందుకు వాళ్ళపైన తిరిగి జరిగేది హింస, అణిచివేతనే. ఇదే దమననీతి ప్రపంచమంతటా అమలవుతున్నది. అది ఏటూరునాగారంలో జరిగిన ఎదురు కాల్పులు కావచ్చు, అది గాజాలో ఇజ్రాయెలీ దురాక్రమణ కావచ్చు, అది ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లలో మహిళలపై జరుగుతున్న అణిచివేత కావచ్చు, మన వద్ద జరిగిన హత్రాస్ ఘటన, మణిపూర్‌లోని మంటలు, కశ్మీరీ సమాజంలోని కల్లోలం కావచ్చు ఇవన్నీ ఏ రూపంలో ఎక్కడ, ఎలా అమలైనా, అవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే. వాటిని నిలువరించగల శక్తి పౌరులుగా తమకు గల హక్కులను ప్రజలు గుర్తించినప్పుడే సాధ్యమవుతుంది.
రచయిత్రి సామాజిక కార్యకర్త
విమల
బహుముఖం