కొలంబో: శ్రీలంక మాజీ ఆర్థిక మంత్రి , చిక్కుల్లో పడిన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తమ్ముడు బాసిల్ రాజపక్సే(71) మంగళవారం కొలంబో విమానాశ్రయంలో విఐపి టెర్మినల్ గుండా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ విమానాశ్రయంలో అధికారులు ఆయన్ని అడ్డుకున్నారు. అమెరికా పాస్‌పోర్ట్ కలిగివున్న బాసిల్.. ఇంధనం, ఆహారం,ఇతర అవసరాలకు వ్యతిరేకంగా వీధి నిరసనలు తీవ్రం కావడంతో ఏప్రిల్ ప్రారంభంలో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసి జూన్‌లో తన పార్లమెంటు సీటును వదులుకున్నారు. కొలంబో విమానాశ్రయంలోని విఐపి టెర్మినల్‌లో బాసిల్‌కు సేవలందించేందుకు తమ సిబ్బంది నిరాకరించారని శ్రీలంక ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలిపింది.
“నిన్న అర్ధరాత్రి నుండి సిల్క్ రూట్ ప్యాసింజర్ క్లియరెన్స్ టెర్మినల్ సేవలను విరమించుకోవాలని మేము నిర్ణయించుకున్నాము” అని అసోసియేషన్ చైర్మన్ కె.ఎ.ఎస్. కానుగల తెలిపారు. ఈ సేవను వినియోగించుకుని అవినీతిపరులు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. శ్రీలంక దేశం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి బాసిల్ బాధ్యతే ఎక్కువ. రాజపక్సే స్థానంలో కొత్త అధ్యక్షుడిని జూలై 20న శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకోనున్నట్లు స్పీకర్ అబేవర్ధన సోమవారం ప్రకటించారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇద్దరూ రాజీనామా చేస్తే… పార్లమెంటు స్పీకర్ గరిష్టంగా 30 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.