కొలంబో : శ్రీలంక సంక్షోభానికి అవినీతిమయమైన రాజపక్స కుటుంబ పాలనే కారణమని శ్రీలంక ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసేలా పట్టుబట్టారు. ఇప్పుడు ఆయన సోదరుడు , ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్ రాజపక్సను దేశం దాటకుండా అడ్డుకున్నారు. స్వదేశంలో ఎదురవుతోన్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోదామనుకున్న ఆయనను విమానాశ్రయం నుంచి వెనక్కు పంపించేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా ఆయనకు క్లియరెన్సు ఇచ్చేందుకు నిరాకరించారు. మంగళవారం ఉదయం బసిల్ రాజపక్స దేశం దాటేందుకు కొలంబో విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి వీఐపీ టర్మినల్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న ప్రజలు బసిల్‌ను గుర్తుపట్టి విమానం వద్దకు చేరుకోకుండా అడ్డుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తెల్లవారుజామున 12.15 గంటలకు ఆయన చెక్‌ఇన్ కౌంటర్‌కు వచ్చారు. కానీ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన ప్రయాణానికి క్లియరెన్స్ ఇవ్వక పోవడంతో మూడు గంటల పాటు ఆయన అక్కడే వేచి ఉన్నారు. ఇక తాను దేశం వీడటం వీలు కాదని తెలుసుకుని విమానాశ్రయం నుంచి వెనక్కు వెళ్లిపోయారని ఆ వర్గాలు తెలిపాయి. “దేశం లోని నెలకొన్న సంక్షోభం కారణంగా, దేశ అత్యున్నత స్థాయి వ్యక్తులు దేశం వీడిపోకుండా ఉండేలా ఇమ్మిగ్రేషన్ అధికారులపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. మేం మా భద్రత గురించి ఆందోళన చెందుతున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు వీఐపీ లాంజ్‌లో విధులు నిర్వర్తించే అధికారులు తమ సేవలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు” అని శ్రీలంక ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమ్మిగ్రేషన్ అధికారుల సంఘం మీడియాకు వెల్లడించింది.