Friday, November 22, 2024

బ్యాలెట్‌కు బుల్లెట్ సవాల్…

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : నక్సల్స్ ప్రాబల్యపు బస్తర్ ప్రాంతంలో బ్యాలెట్ పోరు బుల్లెట్ల పెనుస వాళ్ల నడుమ సాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న అబూజ్‌మడ్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. చత్తీస్‌గఢ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నవంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికలలో నారాయణ్‌పూర్ అసెంబ్లీ స్థానం కీలకంగా మారింది. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యతతో నెగ్గింది. నారాయణ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అబూజ్‌మడ్‌కు వెళ్లాలంటే రాజకీయపార్టీల నేతలకు వణుకే. ఇటీవల ఇక్కడ బిజెపి నేతలను మావోయిస్టులు చంపివేశారు. ఎన్నికల ప్రచారానికి ఎవరు వచ్చినా ఇదే గతి అని చాటారు. దీనితో ఈ దట్టమైన అడవులు, కొత్తవారికి దుర్భేధ్యమైన ప్రాంతం ప్రతి ఎన్నికల సమయంలో పార్టీలకు, ఎన్నికల అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి సవాళ్లు విసురుతుంది.

అబూజ్‌గఢ్ అంటేనే అంతుచిక్కని కొండ అని అర్థం. పేరుకు తగ్గట్లుగా ఈ ప్రాంతం కొండలు గుట్టలు, దారితెన్నూ తెలియనివ్వని అటవీదారులతో ఉంటుంది. దేశంలోని అతి ప్రధాన చిట్టచివరి మావోయిస్టు కోటగా స్థావరంగా ఈ ప్రాంతం నిలిచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ తాము దేశంలోని మావోయిస్టు లేదా నక్సల్స్ హింసాకాండను తుదముట్టించామని చెపుతూ వస్తుంటారు. ఇది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఘనత అంటారు. అయితే వాస్తవిక కోణంలో చూస్తే ఇది సత్యదూరం అని స్పష్టం అవుతోంది. ఇప్పటికీ ఆ ప్రాంతానికి అధికారులు ఎంతటి భద్రతతో అయినా ఇక్కడికి అడుగుపెట్టలేదు. ఎన్నికలకు పక్షం రోజుల ముందు కూడా ఇక్కడ కొట్టోచ్చే రీతిలో ప్రచార స్తబ్ధత నెలకొని ఉంది. బస్తర్ ప్రాంతానికి పైగా ఈ కొండల నెలవుకు తాము వెళ్లలేమని అధికారులు చెపుతున్నారు.

అబూజ్‌మడ్ ప్రాంతం గోవా రాష్ట్రంతో పోలిస్తే పెద్దదిగా ఉంటుంది. దంతేవాడ, బీజాపూర్ జిల్లాలను విస్తరించుకుని ఉంటుంది. మహారాష్ట్రలోచి గడ్చిరోలి సరిహద్దుగా ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 200 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 40000 మంది జనాభా ఉందని వెల్లడైంది. ఈ ప్రాంతంలోని దాదాపు 90 శాతం వరకూ ఇప్పటికీ ఎటువంటి సర్వేకు నోచుకోలేదని అధికారులే తెలిపారు. పేరుకు నారాయణ్‌పూర్ అసెంబ్లీ స్థానమే కానీ నిజానికి ఇది అబూజ్‌మడ్ ప్రాబల్య ప్రాంతం అని అంతా అంగీకరిస్తారు. ఈ ప్రాంతపు ఆదివాసీలను అబూజ్‌మడియాలని పిలుస్తారు. ఎక్కువగా సంచార లక్షణాలు ఉండే గిరిజన తెగలే ఉంటారు. అంతరించి పోతున్న తెగల జాబితాలోకి వస్తున్న ఈ ఏడు ప్రత్యేక గిరిజన తెగలను పివిటిజిలుగా వ్యవహరిస్తారు. వీరి కోసం ప్రత్యేకించి కొన్ని హక్కులు, ప్రయోజనాలు కల్పించారు.

2018 నుంచి ఇప్పటికీ కొత్తగా 312 మంది ఓటర్లు
ఈ ప్రాంతంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. కొత్త ఓటర్ల పేర్లు నమోదు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే 2018 నుంచి ఇప్పటివరకూ కేవలం 312 మంది కొత్త ఓటర్లే నమోదయ్యారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని దాదాపు 15వేల మంది కొత్త ఓటర్లలో వచ్చిచేరారు. బస్తర్‌లోని ఇతర 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటర్ల జాబితాలు వెలవెలపోతున్నాయి. అబూజ్‌మడ్‌లోని మొత్తం 30 పోలింగ్ కేంద్రాలలో సాధారణంగా అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదు అవుతూ వస్తోంది. నక్సలైట్లు ఇచ్చే ఎన్నికల బహిష్కరణ పిలుపు ప్రభావం ఎక్కువగా పనిచేస్తోందనడానికి ఈ పోలింగ్ శాతం తార్కాణం అయింది. ఇక్కడి ఒక్క బూత్ మినహాయిస్తే మిగిలిన చోట్లకు ఎన్నికల సిబ్బందిని కేవలం హెలికాప్టర్లలోనే తరలించాల్సి వస్తోంది. అటవీ ప్రాంతంలో తాము మారుమూల ప్రాంతాలకు వెళ్లడం ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే అని అధికారులు వాపోతున్నారు. నారాయణ్‌పూర్ ఎస్‌టి స్థానంలో బిజెపి , కాంగ్రెస్‌లో బోటాబోటీగా గెలుస్తూ వచ్చాయి. 2013 ఎన్నికల్లో ఇక్కడ బిజెపి గెలిచింది. తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

ఈ ప్రాంతానికి ఎన్నికల సంఘం వెళ్లలేదు
చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ఏర్పాట్ల గురించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రీనా కంగాలే విలేకరులకు తెలిపారు. బస్తర్ ప్రాంతంలో తొలిసారిగా ఇప్పుడు రెండువేల పోలింగ్ బూత్‌లకు ప్రత్యక్ష వెబ్‌కాస్ట్ సౌకర్యం కల్పించారని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం మీద ఇటువంటి ఏర్పాట్లు 12000 పోలింగ్ బూత్‌లకు అమర్చారు. వీటి ద్వారా ఎన్నికల ప్రక్రియను కంట్రోలు రూం నుంచి పర్యవేక్షిస్తారని చెప్పారు. అయితే అబూజ్‌మడ్ ప్రాంతం ఈ ఏర్పాట్ల పరిధికి రాలేకపోయింది. ఎటువంటి టవర్లు పెట్టినా ఇక్కడ ఎక్కువ కాలం మనజాలవని అధికారులు తెలిపారు. ఇటీవల ఇక్కడ నక్సలైట్ల దాడులు పెరుగుతున్నాయని, ఈ దశలో తమ పార్టీయే కాకుండా కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఈ దట్టమైన ప్రాంతానికి వెళ్లేందుకు వెనుకాడాల్సి వస్తోందని బిజెపి నేతలు తెలిపారు. ఈ ప్రాంతంలో బిజెపి స్థానిక నేత సాగర్ సాహూను నక్సలైట్లు ఈ ఫిబ్రవరిలో కాల్చి చంపారు. అప్పటినుంచి ఏదో ఓ చోట దాడులు బెదిరింపులు సాగుతూ ఉన్నాయి.

ఈ ప్రాంతంలో వామపక్ష తీవ్రవాద బెడద ఉందని, ఇందుకు పలు కారణాలు ఉన్నాయని, భౌగోళిక స్వరూపం, ఎక్కువగా లోపలికి వెళ్లలేని ప్రాంతాలు ఉండటం వంటివి సమస్యలు అని నారాయణ్‌పూర్ జిల్లా కలెక్టరు అజిత్ వసంత్ అంగీకరించారు. ప్రభుత్వ యంత్రాంగం పట్ల విశ్వాస పునరుద్ధరణే కీలకమని, దీనికోసం యత్నిస్తున్నామని, పేదలకు ఆరోగ్యం, సంక్షేమం, గర్బిణులకు తోడ్పాటు, స్కూళ్ల ప్రారంభం వంటివి చేపడుతున్నామని వివరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామని బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ తెలిపారు. కొత్త ఠాణాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాడేమెటా, కాడెనర్ వంటి చోట్ల కొత్త బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అబూజ్‌మడ్‌లో మౌలికమైన మార్పు వస్తోందని జర్నలిస్టు ఈ ప్రాంతంపై నక్సల్‌బాదీ అబూజ్‌మడ్ పుస్తకం రాసిన అలోక్ పుతుల్ తెలిపారు. హక్కుల కోసం ఇక్కడి వారు నిరసలకు దిగుతున్నారని, దీని వెనుక నక్సలైట్లు ఉన్నారని విమర్శకులు చెపుతున్నారని, కానీ నక్సల్స్ కూడా జనం హక్కుల సాధనకు ఇంతకు ముందటిలాగా హింసాకాండకు దిగడం లేదని, ప్రజాస్వామిక పద్ధతిలోనే వెళ్లుతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News