Friday, November 22, 2024

వైరస్‌లను మోసుకొచ్చే గబ్బిలం

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో 1200కు పైగా గబ్బిలాల తెగలు ఉండగా, మనదేశంలో 128 తెగలున్నాయి. వైరస్‌లకు కేంద్రంగా గబ్బిలాలు ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ గబ్బిలాల నుంచి వ్యాపించే వైరస్‌లు మనకు ప్రాణాంతకాలే. ముఖ్యంగా ఫ్రూట్ తెగకు చెందిన గబ్బిలాల నుంచి స్రవించే ద్రవాలు ఈ ఫిలో వైరస్‌లను మనుషులకు వానరాలకు వ్యాపించ చేస్తాయని పరిశోధనలో తేలింది. ఈ వైరస్ మనుషుల్లో హెమరేజిక్ జ్వరాన్ని , రక్తం చిమ్మడం, ఎబోలా వైరస్ వంటి హానికర అనారోగ్య లక్షణాలను కలిగిస్తుందని చెబుతున్నారు. గబ్బిలాలు వైరస్‌లను ప్రతిఘటించే వ్యాధినిరోధక శక్తితో ఉండడం వల్ల వాటికి వైరస్‌ల నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. గబ్బిలాల్లో వైరస్ కుటుంబాలను ప్రతిఘటించే యాంటీబాడీల ప్రతిస్పందనను తెలుసుకోడానికి ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ వైవిధ్యం లోని ఏ భాగం సంభావ్య వ్యాధికారకమో అధ్యయనం చేస్తున్నారు. ఇంతవరకు జన్యువ్యాప్తి, అనేక బ్యాక్టీరియా ,వైరల్ సమూహాలను గబ్బిలాల్లో 3 శాతం నుంచి 10 శాతం వరకు ఉండడాన్ని పరిశోధకులు గమనించారు. గబ్బిలాలు, మనుషులు కొన్ని వైరల్ సమూహాల నియంత్రణలో యాంటీబాడీల స్పందనను పరస్పరం పంచుకుంటున్నట్టు తెలుసుకున్నారు. భవిష్యత్తులో సంక్రమించే ఎలాంటి వైరస్‌లనైనా తట్టుకోడానికి సిద్ధం అయ్యేందుకు ప్రాథమిక ఆధారాలుగా వైరస్‌ల జన్యువుల బ్యాంకును ఏర్పాటు చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్‌సిబిఎస్) భావిస్తోంది.

గబ్బిలాల మొత్తం వైరస్ జన్యుసరళిని విశ్లేషించే ప్రక్రియలో ఎన్‌సిబిఎస్ ఉంటోంది. గబ్బిలాలు అనేక వైరస్‌లను మోసుకొస్తుంటాయన్నది వాస్తవం. అయితే మన చుట్టూ సంచరించేఈ గబ్బిలాల నుంచి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గబ్బిలాలను వేటాడరాదు. వాటి మాంసాన్ని ఆరగించకూడదు. అవి ఎంగిలి చేసి పారేసిన పండ్లను కానీ విత్తనాలను కానీ తీసుకోకూడదు. అయితే పర్యావరణ పరిరక్షణలో గబ్బిలాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. అవి చీడపీడలను తొలగిస్తాయి. దోమలు, వ్యాధికారక సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News