బటిండ(పంజాబ్): బటిండ సైనిక కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక సైనిక జవాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కంటోన్మెంట్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. బటిండ సైనిక కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగిన కాల్పుల సంఘటనకు, జవాను ఆత్మహత్యకు ఎటువంటి సంబంధం లేదని సైన్యం తెలిపింది. సెంట్రీ డ్యూటీలో ఉన్న జవాను బుధవారం సాయంత్రం 4.30 గంలలకు తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడిన జవానును లఘు రాజ్ శంకర్‌గా గుర్తించినట్లు బటింగ కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గుర్దీప్ సింగ్ తెలిపారు.
Also Read: ధోని బాదిన మూడు సిక్స్‌లు… రికార్డు బద్దలు
మృతుడి పక్కన పడి ఉన్న తుపాకీని బట్టి తూటా అందులోనుంచి వచ్చిందేనని నిర్ధారించారు. కణతకు గురిపెట్టుకుని అతడు కాల్చుకున్నట్లు ఆయన చెప్పారు. వెంటనే అతడిని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. అయితే ఆసుపత్రిలో అతడు మరణించినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 11న సెలవు పూర్తిచేసుకుని అతడు తిరిగి విధుల్లో చేరినట్లు సైన్యం తెలిపింది. కాగా..బటిండ సైనిక కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి ఘటనపై సైన్యం, పంజాబ్ పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.