Wednesday, January 22, 2025

నేటి నుంచి ‘బతుకమ్మ’

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ 3వరకు
కొనసాగనున్న సంబురాలు

అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం మహిళా
ఉద్యోగినులకు ప్రత్యేక సడలింపు మధ్యాహ్నం
3గంటల వరకే విధులు శోభాయమానంగా
హైదరాబాద్ జిల్లాల్లోనూ ఘనంగా ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పండుగ బతుకమ్మకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. దీని కో సం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 10 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి అక్టోబర్ 3వ తేదీ వర కు తొమ్మిది రోజలు పాటు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆశ్వయుజ అమావాస్య (ఆదివారం) నాడు ఎంగిలి పూలు పేరుతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రం ఇప్పటికే శోభాయమనంగా మారింది. నిమజ్జనం కోసం చెరువులు, కుంటలు, బావుల వద్ద దగదగలాడే విద్యుత్ దీపాల ను ఏర్పాటు చేశారు. బతుకమ్మలు ఆడే ప్రాంతాలు కూడా ప్రకాశమంతమైన విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ ఫీవర్ నెలకొంది. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి చోటా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గల్ఫ్ దేశాలు, అమెరికా వంటి చోట్ల కూడా బతుకమ్మ వేడుకలు జరుగుతుండడం విశేషం. పండుగలు అంటేనే సాధారంగా ఎక్కడైనా దేవతల్ని పూలతో కొలుస్తారు.

కానీ పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి బతుకమ్మలో ఉంది. అందుకే బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైంది. తొమ్మిది రోజులూ తీరొక్క పూలతో అందంగా తుకమ్మను పేరుస్తారు. సిబ్బి లేదా పళ్లెంలోగాని, తాంబూలంలోగాని అడుగున ఆకులు పరిచి, తంగేడు పూలు, గునును పూలు, బంతి పూలు.. ఇలా ఈ సీజన్‌లో దొరికే పూలతో బతుకమ్మను అందంగా పేరస్తారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలంకరించి, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, తమ ముత్తయిదువ తనాన్ని నిలిపే గౌరమ్మను భక్తిగా పూజిస్తారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఆడవాళ్లంతా ఒక చోట చేరి, బతుకమ్మ చుట్టూ నిలిచి చప్పట్లు కొడుతూ, కోలలు వేస్తూ, పాటలు పాడుతూ, ఉత్సాహంగా బతుకమ్మ వేడుకగా జరుపుకొంటారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేకంగా సడలింపులను ఇచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల వరకే విధులు నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బతుకమ్మ ఆడుకునే వెసలుబాటును కల్పించింది.

శోభాయమానంగా హైదరాబాద్

బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు హైదరాబాద్ నగరాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా ట్యాంక్‌బండ్,
హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. సాగర్ చుట్టూ రంగురంగుల విద్యుత్దీపాలను ఏర్పాటు చేశారు. సాగర్‌లో రంగురంగుల వాటర్ ఫౌంటేన్లను ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని ప్రధాన కూడళ్లలో హోర్డింగులను నెలకొల్పారు. కాగా సద్దుల బతుకమ్మ పండుగ రోజున సాగర్ చుట్టూ బతుకమ్మ పాటలు వినిపించేలా స్పీకర్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పండుగ గొప్పగా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చెరువుల వద్ద లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే చెరువులకు వెళ్లే దారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు కూడా పూర్తి చేశారు. ఇక బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలను సీరియల్ లైట్లతో అలంకరించారు, ముఖ్య కూడళ్లలో లైట్లతో తయారు చేసే బతుకమ్మలను ఏర్పాటు చేశారు.

గుబాళించనున్న సాంస్కృతిక పరిమళం

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక పరిమళం గుబాళించనుంచనుంది. తొమ్మిది రోజుల పూల ధూంధాం జాతరకు పల్లెలు ముస్తాబు అయ్యాయి. ఈ సంబురంలో పాలు పంచుకునేందుకు తంగేడు, బంతి, చామంతి, గుమ్మడి, దోస, గునక, జిల్లేడు, మందార పూలు చెట్ల మీద పురి విప్పుకుని పిలుస్తున్నాయి. తంగేడు ఆకులు, దోస ఆకులు నేనంటే నేనని పోటీ పడుతున్నాయి. చెరువులు కడుపునిండా నీరు నింపుకుని బతుకమ్మలకు అలల ఉయ్యాలలు సిద్ధం చేశాయి. వెదురు సిబ్బిలు ఇంటికి చేరుతుంటే.. రాగి తాంబాళాలు అటక మీదినుంచి కిందికి దిగుతున్నాయి. అల్మారలో పట్టుచీరలు ఏడాది విరహానికి వీడ్కోలు చెబుతున్నాయి.

ఉయ్యాల, గౌరమ్మ, చందమామ పాటలు మళ్లీ గొంతులు సవరించుకుంటున్నాయి. నిన్నటిదాకా ముసలోల్ల నిట్టూర్పులతో బావురుమన్న పెద్ద పెద్ద ఇండ్లు ఇపుడు తిరగడానికి జాగ లేనంతగా ఇరుకు ఇరుకుమారుతున్నాయి. నేటి పగటి నుంచి గిన్నెలు, తాంబాళాల్లో కలిపిన రంగుల్లో తెల్ల గునకపూలు రంగులు మారుతుంటే, దోస ఆకుల మీద తీరొక్క పూలు పరుచుకుంటాయి.

ఏ రోజున…. ఏ బతుకమ్మ

25వ తేదీన- ఎంగిలి పూల బతుకమ్మ,26న- అటుకుల బతుకమ్మ,27వ – ముద్దపప్పు బతుకమ్మ,28న – నానే బియ్యం బతుకమ్మ 29న అట్ల బతుకమ్మ, 30న- అలిగిన బతుకమ్మ, అక్టోబరు 1న – వేపకాయల బతుకమ్మ
2న – వెన్నముద్దల బతుకమ్మ, 3న -సద్దుల బతుకమ్మను చేస్తారు.

ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం

బతుకమ్మ వేడుకలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మహిళలు, ఉద్యోగుల భాగస్వామ్యంతో సంబురాలు వీధివీధినా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి హైదరాబాద్లో మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్న వేడుకలను మరోసారి లోకానికి చాటి చెప్పేందుకు సన్నాహాలను పూర్తి చేశారు. కాగా చివరి రోజున సద్దుల బతుకమ్మ వేడుకల కోసం నిమజ్జనానికి చిన్న క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలీసు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాత్కాలిక మరుగుదొడ్లును కూడా ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News