కానిస్టేబుళ్ల ఛల్ సెక్రటేరియట్‌ను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ నిరసన తెలుపుతున్న టిజిఎస్‌పి కానిస్టేబుళ్లను ఇవాళ సచివాలయ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర నలుమూలల నుంచి నగరానికి వచ్చిన బెటాలియన్ కానిస్టేబుళ్లు సోమవారం ఉదయం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి సెక్రటేరియట్‌కు బయలు దేరిన వారిని పోలీసులు ఎన్‌టిఆర్ స్టేడియం వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి, డిజిపి జితేందర్ తమను పిలిచి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సిఎం రేవంత్ రెడ్డి ఏక్ పోలీస్ చేస్తానని వందసార్లు చెప్పాడని ఓ బెటాలియన్ కానిస్టేబుల్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తమను కనీసం కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రివ్యూ మీటింగ్ పెట్టి తమ సమస్యను తీర్చే సమయం కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలన చేతగాక అన్ని వ్యవస్థలను నాశనం చేస్తూ.. న్యాయం చేయాలని అడిగిన వారిని అరెస్టులు చేయించడమేనా ప్రజా పాలన అని నిలదీశారు. కాగా, సెక్రటేరియట్‌లో విధులు నిర్వర్తిస్తున్న టిజిఎస్‌పి సిబ్బందికి ఛీఫ్ సెక్యూరిటీ అధికారి ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందిపై నిఘా పెట్టామని ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తున్నామని తెలిపారు. సచివాలయం పరిధిలోని రెండు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఐదుగురి కంటే ఎక్కువగా గుమికూడవద్దని, ధర్నాలు, రాస్తారోకోలు, సచివాలయం ముట్టడి వంటి కార్యక్రమాల్లో పాల్గొంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్‌గా ఉంటూ సిబ్బందిని యాడ్ చేయడం, టిజిఎస్‌పి, పోలీస్ అధికారుల గురించి రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని ఆదేశించారు.
బెటాలియన్ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెక్రటేరియట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. పరిపాలన సౌధం చుట్టూ 163 సెక్షన్ విధించారు. సెక్రటేరియట్ పార్కింగ్ గ్రౌండ్‌లో సుమారు 200 మంది సిబ్బందిని మోహరించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంతి రేవంత్ ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న టిజిఎస్‌పి పోలీసులను మార్చి, వారి స్థానంలో స్పెషల్ పోలీసులను నియమించారు.
రిమూవ్ చేసిన తగ్గని పిసిలు…
తమ సమస్యలను తీర్చాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు కొద్దిరోజులుగా చేస్తున్న ఆందోళనలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం భార్యాపిల్లలతో రోడ్డెక్కిన కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లను ఒకే రోజు 39 మందిని సస్పెన్షన్ చేస్తూ అర్ధరాత్రి వేళ ఉత్తర్వులు ఇచ్చింది. తమ సహోద్యోగులు సస్పెన్షన్ గురికావడంతో వారికి బెటాలియన్ కానిస్టేబుళ్లంతా బాసటగా నిలిచారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని బెటాలియన్ల ముట్టడి చేపట్టారు. గంటలకొద్దీ బెటాలియన్ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టినా.. కమాండెంట్ పట్టించుకోకపోవడంతో పట్టరాని కోపంతో రోడ్డెక్కారు. అనంతరం రాత్రి వేళ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయినప్పటికీ సర్కారులో చలనం రాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకారం సోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు