Thursday, January 23, 2025

కాంగ్రెస్ అధికారంలో రాగానే” బిసి బంధు” తీసుకొస్తాం: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 54 శాతం ఉన్న బిసిల అభ్యున్నతి కోసం బిసి సబ్ ప్లాన్ చట్టం తీసుకువస్తామని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అన్నారు. అలాగే బిసి బంధు పథకం తీసుకురావడానికి ఆలోచన చేస్తామని కూడా ప్రకటించారు. కేజీ టు పేజీ వరకు నిర్బంధ విద్యను అందిస్తామని, పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా ఆయన ఇందిరమ్మ రాజ్యంలోనే బడుగు, బలహీన వర్గాలు సుభిక్షంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు.

41 రోజులుగా భగభగ మండుతున్న ఎండలను భరిస్తూ అకాల వర్షాల్లో తడుస్తూ, గాలి దుమారానికి వేసుకున్న టెంట్లు కూలిపోయి ఇబ్బందులు పడుతున్నా పాదయాత్రను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటామని అడవి బిడ్డలు తనతో పాదయాత్రలో పాల్గొంటున్నట్లు చెప్పుకొచ్చారు. మన సంపద మనకే, మన కొలువులు మనకే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వెయ్యకపోగా, ఇచ్చిన ఒక నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్ష ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసిన బిఆర్‌ఎస్‌ప్రభుత్వంపై విద్యార్థులు చాలా అక్రోషంగా ఉన్నారన్నారు. తమ జీవితాలతో చెలగాటమాడిన బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని కాకతీయ విద్యార్థులు చెప్పినట్లు వెల్లడించారు.

Also Read: బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లడతా:ఈటల

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్ట మొదటిగా గెలిచేది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనేని అన్నారు. తాము అధికారంలోకి రాగానే కూలి బందు పథకం తీసుకు వచ్చి ఏడాదికి 12 వేల రూపాయలు కూలీల ఖాతాలో జమ చేస్తామన్నారు. పేదలకు ఇంటి స్థలాలతో పాటు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, భద్రాచలం ఎంఎల్‌ఎ పొదేం వీరయ్య, డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి బండ్రు శోభారాణి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి దొమ్మాటి సాంబయ్య, పిసిసి ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News