Saturday, December 21, 2024

టీమిండియాకు బ్యాటింగే భారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: టీమిండియాను కొంత కాలంగా బ్యాటింగ్ సమస్య వెంటాడుతున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌తో పాటు తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలను భారత్‌ను ఈ సమస్య వేధిస్తోంది. ఆసీస్‌తో జరిగిన మూడు టెస్టులోనూ భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.

యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. భారీ ఆశలు పెట్టుకున్న యశస్వి, గిల్‌లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నారు. కొంతకాలంగా టెస్టుల్లో అదరగొట్టిన వీరిద్దరూ ఆసీస్ గడ్డపై మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. ఇద్దరు తమ సహాజ శైలీలో బ్యాటింగ్ చేయలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. లేకుంటే టీమిండియాకు మిగిలిన మ్యాచుల్లోనూ ఇబ్బందులు తప్పక పోవచ్చు.

తీరు మారాల్సిందే..

వరుస వైఫల్యాలు చవిచూస్తున్న టీమిండియా బ్యాటర్లు తమ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. సీనియన్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి బ్యాటర్ చెత్త బ్యాటింగ్‌తో నిరాశకు గురి చేస్తున్నాడు. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లి పూర్తిగా తేలిపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. ఈ సిరీస్‌లో జట్టుకు అండగా నిలుస్తాడని ఆశిస్తే పేలవమైన బ్యాటింగ్‌తో టీమ్‌కు భారంగా మారాడు.

ఒకప్పుడూ ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహాస్వప్నంగా ఉన్న కోహ్లి ఇటీవల కాలంలో ఫామ్ లేమీతో బాధపడుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా 15 పరుగులకు మంచి స్కోరును సాధించలేక పోయాడు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మది కూడా ఇలాంటి పరిస్థితే. ఇప్పటి వరకు ఆడిన రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. అడిలైడ్ టెస్టులో అయితే రెండు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. మూడో టెస్టులో కూడా తేలిపోయాడు.

వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. అతను కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. రానున్న మ్యాచుల్లోనైనా రోహిత్, కోహ్లి, పంత్‌లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటోంది. ఈ సిరీస్‌లో కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తప్ప మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. దీంతో ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియాకు బ్యాటింగ్ కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా బ్యాటర్లు తమ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే జట్టుకు ప్రయోజనంగా ఉంటుందిఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News