బత్తిని మొగిలయ్య గౌడ్ ఓరుగల్లుకు చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు. బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ తూర్పుకోట నివాసి. తల్లిదండ్రులు బత్తిని చెన్నమ్మ, మల్లయ్యలు. బత్తిని మొగిలయ్య గౌడ్ ఆర్యసమాజ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. స్వాతంత్య్ర అభిలాషను విస్తృతపరిచే దిశగా పన్నెండవ జాతీ యాంధ్ర మహాసభలు 1946లో వరంగల్‌లోని మడికొండలో జరిగాయి. రహస్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ జెండా ఎగుర వేయాలనేది సభల ఉద్దేశం. నిజాం రాష్ట్రంలో త్రివర్ణ పతాకావిష్కరణ అధికారికంగా నిషేధించబడింది. జెండా ఎత్తడం అంటే దెబ్బలకు, జైలుశిక్షకు, మరణానికి వెరవకుండా చేసే సాహసోపేత కార్య క్రమమే.
వరంగల్ కోటలో దేశభక్తి ప్రేరితులైన యువకులు బత్తిని రామస్వామి గౌడ్, బత్తిని మొగిలయ్య గౌడ్, సంగరబోయిన కనకయ్య, సంగరబోయిన మల్లయ్య, నరిమెట్ల రామస్వామి, వడ్లకొండ ముత్తయ్య, పోశాల కనుకయ్య, ఆరెల్లి బుచ్చయ్య తదితరులు జెండా వందన కార్యక్రమాలను కోట ప్రజల సమక్షంలో నిర్వహించేవారు. స్టేట్ కాంగ్రెస్, కార్యకర్తలందరికీ రహస్యంగానైనా జెండా ఎగుర వేయాలనే ఆదేశాలిచ్చింది. స్టేట్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం వరంగల్‌లోని చైతన్యం కలిగిన యువకులు, కాంగ్రెస్ నాయకులు, ఆర్యసమాజ్ కార్యకర్తలు వరంగల్ కోటలో జెండా ఎగుర వేసేవారు.
11 ఆగస్టు 1946 ఆదివారం రోజు ఉదయం 7.30 గం.కు వరంగల్ తూర్పు కోటలో జెండా ఎగుర వేయడానికి వరంగల్, హన్మకొండ నుండి వచ్చి కాంగ్రెస్ నాయకులు యంయస్ రాజలింగం, టి హయగ్రీవాచారి, భూపతి కృష్ణమూర్తి, మడూరి రాజలింగం, బత్తిని సోదరులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హయగ్రీవాచారి జెండాను ఎగురవేయగా, త్రివర్ణ పతాకం వందనంచేసి పిల్లలు, పెద్దలంతా జై కొట్టారు. అప్పుడే సుమారు రెండు వందల మంది రజాకార్లు, వారి అనుయాయులు మారణాయుధాలతో ఖాసీం షరీఫ్ అనే రజాకార్ నాయకుని అధ్వర్యంలో జెండా ఎత్తిన నాయకులను చంపడానికి నిజాం అనుకూల నినాదాలను చేస్తూ జెండా ఎత్తిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎగిరిన జెండాను చూసి కోపం కట్టలు తెంచుకున్న రజాకార్లు, జెండాను దించి తొక్కి, తగలబెట్టి, అంతా కలిసి బత్తిని రామస్వామి గౌడ్ ఇంటి వైపు అరుస్తూ, తిడుతూ వెళ్ళారు.
జెండా ఎత్తిన ప్రధాన నాయకులైన హయగ్రీవచారి, భూపతి కృష్ణమూర్తి, పంచాయతి హవల్దారు కె.సమ్మయ్య, వెంకట్రాం నర్సయ్య, యంయస్ రాజలింగం వీరందరూ బత్తిని రామస్వామి ఇంట్లో కూడి భవిష్యత్తు జెండా వందన కాంగ్రెస్ కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు. ఆ ఇంటి చుట్టూ మోహరించిన రజాకార్లు ఇంట్లోకి వెళ్ళి వాళ్లను చంపే ప్రయత్నం చేశారు. శనిగారం పుల్లయ్య అనే ఆర్యసమాజ్ కార్యకర్త తాటివనంలో ఉన్న మొగిలయ్యను కలిసి రజాకార్ల దాడి గురించి చెప్పాడు. మరుక్షణం తన ఇంటివైపు పరుగు తీశాడు. మెరుపు వేగంతో ఇంటి సూరులోని పదునైన కత్తిని తీసి, మెరుపులా రజాకార్ల మూకపైపడి యుద్ధం మొదలుపెట్టాడు.
ఈ దాడికి నాయకత్వం వహించిన ఖాసీం షరీఫ్‌తో సహా, రజాకార్లంతా చీమల పుట్ట చెదిరినట్లుగా చెదిరి పోయారు. రజాకార్లు తిరిగి మొగిలయ్యపై మూకుమ్మడిగా రెండవ మారు దాడికి పాల్పడ్డారు. రెండవసారీ మొగిలయ్య వారిని తరిమివేశాడు. కానీ మూడవసారి దాడిలో ఖాసీం షరీఫ్ బల్లెంతో మొగిలయ్య వైపు వస్తున్నప్పుడు, మొగిలయ్య తన శత్రువును నరకడానికి తన ఎత్తిన కత్తిని తన ఇంటి ముందు గల పందిరి గుంజల మధ్య చిక్కుకుంది. ఇదే అదనుగా భావించిన షరీఫ్ తన బల్లెంతో మొగిలయ్య గుండెల మీద పొడిచాడు. అలా రజాకార్ల మూకుమ్మడి దాడిలో మొగిలయ్య అమరుడైనాడు.
రామ కిష్టయ్య సంగనభట్ల,
9440595494
(నేడు బత్తిని మొగిలయ్య గౌడ్ జయంతి)