బిజెపిని ఓడించేందుకు మూడు పార్టీలు కుమ్మక్కు
: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై చేవెళ్ల ఎంపీ కొండా కీలక వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెలలో జరుగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బిజెపి అభ్యర్థిని ఓడించేందుకు ఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికలో జరిగేది సిద్దాంతపరమైన యుద్దమని పేర్కొన్న ఆయన ఒక మతతత్వ పార్టీకి, సెక్యూలర్ పార్టీకి జరుగుతున్న యుద్దమని అభివర్ణించారు. దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీతో పోరాడేందుకు మూడు పార్టీలు కుమక్కు అయ్యాయని తెలిపారు. ప్రత్యర్థి పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు ఎంఐఎం పార్టీకి సెక్యూలర్, అంబేద్కర్ అనే పదాలు వాడే హక్కుందా అని ప్రశ్నించారు. అలాగే యాంటీ సెక్యూలర్ పార్టీ అయిన ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఐఎంకు మద్దతు ఇస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు సెక్యూలర్ అనే పదం వాడే హక్కుందా అని నిలదీశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు లొంగిపోయి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకేనా బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో నిలబడటం లేదని విమర్శించారు. ఎంఐఎం లేకుంటే కాంగ్రెస్ పార్టీ బ్రతకలేదని అందుకే వారికి లొంగిపోయారని ఎద్దేవా చేశారు. ఒక మతం గురించి కాకుండా దేశం గురించి ఆలోచించడమే సెక్యూలర్ భావజాలమని అంబేద్కర్ పేర్కొన్నారని తెలిపారు. ఎంఐఎంకు మద్దతు ఇస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు సెక్యూలర్ అనే పదం వాడే హక్కు లేదని పేర్కొన్నారు.
ప్రజల కోసం బీజేపీ చేస్తున్న కార్యక్రమాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు. ఇక బీఆర్‌ఎస్ వాళ్లని ఎన్నికల్లో ఓటు వేయొద్దని పార్టీ పెద్దలు చెబుతున్నారని అన్నారు. వాళ్లు ఇంట్లో కూర్చొని ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. చదువుకున్న వాళ్లంతా ఓటు వేసే ముందు ఆలోచించాలని, నిజంగా సెక్యూలర్ భావజాలం ఉంటే, దేశ భక్తి ఉంటే, భారతీయులంతా ఒక్కటే అనుకుంటే ఆత్మ ప్రభోధానుసారం ఓటు వేయాలని కోరారు. అలా ఓటు వేస్తే బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. మీడియా సమావేశంలో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు.