Monday, December 23, 2024

నిఖార్సైన అంబేడ్కర్‌వాది బత్తుల

- Advertisement -
- Advertisement -

ఈ దేశ భూమి పుత్రులు, సింధు, హరప్పా, మోహంజుదారో వంటి ప్రపంచ స్థాయి నాగరికతలకు నాంది పలికిన ఆది భారతీయులు / మూల భారతీయులు (ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు) కుల వ్యవస్థ కుటిల నీతికి బలై ఊరికి దూరంగా వెలివేయబడ్డారు. సర్వమానవ సౌభాగ్యం కోసం ‘పెంట కుప్పకు పంట చేనుకు బహు చక్కని బంధమేసి నల్లని మట్టి నుండి తెల్లని బువ్వని తీసి ఆకలిని తీర్చి, ఉత్పత్తితో మమేకమై నిరంతరం ప్రకృతితో పోరాటం చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పోసిన ఆది భారతీయులు అంటరానివారై వేల సంవత్సరాల పాటు మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుకొని ఊరికి దూరంగా వెలివేయబడి పశువుల కంటే హీనంగా చూడబడి జీవనం సాగించారు.

అలా వేల ఏళ్లుగా కష్టజీవులను వెతలకు, వెట్టికి గురి చేసి వెళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ కుత్తుక కోసిన మహనీయుడు, భారత రత్న, ప్రపంచ మేధావి డా. బాబా సాహెబ్ అంబేడ్కర్. ఆయన ఆలోచనలను, ఆశయాలను దేహంలోని అణువు అణువునా నింపుకొని అనునిత్యం ఆయన అడుగు జాడల్లో నడిచి నిఖార్సైన అంబేడ్కర్ వాదికి నిలువెత్తు రూపం బత్తుల శ్యాంసుందర్. తుది శ్వాస విడిచే వరకు తాడిత పీడిత ప్రజల అభ్యున్నతే శ్వాసగా సాగిపోయిన అణగారిన ప్రజల హక్కుల గొంతుక బత్తుల శ్యాంసుందర్. ఆయన డిసెంబర్ 21, 1908 న హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో భాగమైన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో అతి సామాన్యమైన మాల కుటుంబంలో జన్మించారు.

తర్వాత అక్కడి నుండి నిజాం రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మకాం మార్చారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, న్యాయ శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. విద్యార్థి దశలోనే విద్యార్థి నాయకుడిగా దళితులపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన స్వతంత్ర, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. మరాఠి, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ వంటి భాషల్లో అనర్గళంగా మాట్లాడ గల బహుభాషా కోవిదుడు, గొప్ప పండితుడు, రాజనీతి దురంధరుడు, గొప్ప పార్లమెంటేరియన్. డా. బి.ఆర్. అంబేడ్కర్ తర్వాత అంతటి మేధో సంపత్తి కలిగిన గొప్ప తత్వవేత్త, బహు గ్రంథ రచయిత బత్తుల శ్యామ్ సుందర్.

తెలుగు నేలపై బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేడ్కర్ కంటే ముందే 1906 వ సంవత్సరంలో మాధరి భాగ్యరెడ్డి వర్మ నేతృత్వంలో దళిత ఉద్యమానికి పునాదులు పడ్డాయి. తెలుగు గడ్డపై దళితోద్యమ తొలి పొద్దు భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్ర మండలి, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, మన్నే సంఘం వంటి సంస్థలను స్థాపించి చేస్తున్న పోరాటానికి హైదరాబాద్ అంబేడ్కర్‌గా పేరు గాంచిన బి.ఎస్. వెంకట్ రావు, మాదిగల అభ్యున్నతి కోసం అరుంధతీయ సంఘాలను స్థాపించిన అరిగే రామస్వామి, పి.ఆర్. వెంకట స్వామి, ఎం.ఎల్. ఆదయ్యలాంటి వారు తోడవ్వడంతో తెలుగు నేలపై దళితోద్యమం తార స్థాయికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో అణగారిన ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం భారత దేశ వ్యాప్తంగా గళమెత్తి నినదించి పోరాటం చేస్తున్న బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ పోరాటం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉవ్వెత్తున ఎగిసి నవ శకానికి నాంది పలుకుతుంది. ఇటు తెలుగు నేలపై అటు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమ స్ఫూర్తిని అణువణువునా ఆకళింపు చేసుకున్న శ్యాం సుందర్ ఉద్యమానికి అంకితం అయ్యాడు.

‘బ్రాహ్మణీయ శక్తుల కుట్రల వల్ల అంటరాని వారిగా చిత్రీకరించబడిన మేము మూల భారతీయులం. అనాగరికులైన ఆర్యుల రాకకు ముందు ఈ దేశాన్ని ఏలిన పాలకులం. హరప్పా- మోహంజొదారో లాంటి ప్రాపంచిక నాగరికతలకు పునాదులు వేసిన నిర్మాతలం. మేం ఎప్పటికీ హిందూ మతంలో భాగం కాము, భారత దేశంలో హిందూ మత తత్వంతో కూడిన రాజ్యస్థాపనకు సహకరించం సరికదా, ధ్వంసం చేయడానికి ఏ మాత్రం వెనుకాడమంటూ” మనువాద హిందూ మత మౌఢ్యంపై అంతిమ శ్వాస వరకు అలుపెరగకుండా పోరాడిన అవిశ్రాంత పోరాట యోధుడు శ్యాంసుందర్.

మతం మనిషిని విజ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపు నడిపిస్తుందని, మతం వల్ల తాడిత పీడిత వర్గాల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు కాబట్టి విద్య, జ్ఞాన సముపార్జన ద్వారానే జీవితాల్లో సమూల మార్పులు సంభవిస్తాయని చాటి చెప్పిన గొప్ప హేతువాది ఆయన. దళితులు, అణగారిన ప్రజల జీవితాల్లో వేల సంవత్సరాలుగా అలుముకున్న వెనుకబాటుతనం పోయి వెలుగులులోకి రావాలంటే, దోపిడీదారుల దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందాలంటే ‘విద్య’ అనే ఆయుధాన్ని తమ అమ్ములపొదిలో చేర్చుకోవాలని చెప్పిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయం కోసం ఆనాటి నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న బి.ఎస్. వెంకట్రావ్‌తో కలిసి షెడ్యూల్డ్ కులాల ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి దాని ద్వారా మదర్సా-ఏ- పస్తాఖ్యోం (అస్పృశ్యుల కొరకు బడులు) స్థాపించాడు.

నిజాం హైదరాబాద్ రాష్ట్రంలోని దళితుల సామాజిక-, ఆర్థిక, -రాజకీయ, -సాంస్కృతిక అభివృద్ధి కోసం 1930- 34 మధ్య కాలంలో హైదరాబాద్ లోని దళిత యువతను జాగృత పరిచి ‘యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్’ స్థాపించాడు. భారత దేశ వ్యాప్తంగా అంబేడ్కర్ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడాలనే సంకల్పంతో, అంబేడ్కర్‌ను రౌండ్ టేండ్ సమావేశానికి వెళ్లనివ్వకుండా గాంధీ చేస్తున్న కుట్రలను చిత్తు చేయడానికి ‘యూత్ లీగ్ ఆఫ్ అంబేడ్కర్ రైట్స్’ స్థాపించాడు. బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేడ్కర్ తర్వాత ఈ దేశంలోని దళితుల, అణగారిన ప్రజల దుర్భరమైన పరిస్థితులపై అంతర్జాతీయ వేదికలపై మాట్లాడి ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి శ్యాం సుందరే. ఈ దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యరాజ్య సమితిలో, ఇతర అనేక అంతర్జాతీయ వేదికలపై అనర్గళంగా మాట్లాడిన ఆయన వాగ్ధాటికి, మంత్రముగ్ధులై అంతర్జాతీయ మేధావులైన హెరాల్డ్ లాస్కీ, జీపాల్ సార్త్రే, చైనా అధినేత చౌయెన్‌లై వంటి వారు ఆయనకు స్నేహితులుగా మారిపోయారు.

ఆయన కేవలం సామాజిక ఉద్యమాలకే పరిమితం కాకుండా ‘రాజ్యాధికారం అనేది ఒక మాస్టర్ కీ, రాజ్యాధికారం ద్వారానే సామాజిక, -ఆర్థిక, -సాంస్కృతిక రంగాల్లో సమూలమైన మార్పులు తీసుకొని రావొచ్చు, రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయని’ బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేడ్కర్ చెప్పిన మాటల నుండి స్ఫూర్తి పొంది క్షేత్రస్థాయిలో పోరాడడం ఎంత ముఖ్యమో చట్టాలు చేసే చట్టసభల్లో పోరాడడం కూడా అంతే ముఖ్యమని భావించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. రాజకీయ రంగంలో ప్రవేశించి అక్కడ కూడా ఆయన తనదైన ముద్ర వేశాడు. గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుండి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1957వ సం॥లో కర్ణాటకలోని బాల్కీ బీదర్ నుండి విధాన సభకు ఎన్నికై, ఉప సభాపతిగా సమర్థవంతంగా పని చేశాడు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ చూపిన మార్గంలోనే ఈ దేశం సామాజిక, -ఆర్థిక, -రాజకీయ-, సాంస్కృతిక రంగాల్లో రాణించి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని బలంగా నమ్మిన నాయకుడు శ్యామ్ సుందర్.

ఒకప్పుడు ఈ దేశంలో మల్ల యుద్ధ విద్యకు ఆజ్యం పోసి ప్రపంచానికి మార్షల్ ఆర్ట్ పరిచయం చేసిన జాతులు, 1818 భీమా కోరేగాం యుద్ధంలో కేవలం 500 మంది మహర్ సైనికులు పీష్వా బాజీరావు -II కు చెందిన 28 వేల మందికి పైగా సైనికులను మట్టికరిపించిన వీరత్వం కలిగిన దళితులపై ఈ దేశంలో అనునిత్యం ఏదో ఒక మూలన జరుగుతున్న దాడులను అరికట్టడానికి దళిత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అంతం చేయడానికి ఆత్మరక్షణ దళంగా,సామాజిక సాంస్కృతిక విప్లవం వేగవంతం చేయడానికి వాస్తవాలు న్యాయం పునాదులుగా “భీంసేన”ను స్థాపించాడు. దళితులపై ఎక్కడ దాడులు జరిగినా భీం సేన ప్రతిఘటించేది.

అంతే కాకుండా అంబేడ్కర్ రచనలను, ఆశయాలను భీం సేన విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇవాళ అంబేడ్కరిజం ఇంతగా పరిఢవిల్లుతుంది అంటే కారణం నాడు శ్యామ్ సుందర్ భీం సేన ద్వారా చేసిన కృషి అని చెప్పకుండా వుండలేము. రచయితగా మూల భారతీయులు, సజీవ దహనం, భూ దేవతోం కా మేనిఫెస్టో, భీం సేన అవర్ పాస్ట్ అండ్ ప్రజంట్, దే బర్న వంటి అనేక పుస్తకాలను రాశాడు. ఆయన సమాజానికి చేసిన సేవలకు బహుమానంగా నిజాం ప్రభుత్వం ఆయనకు ఖుస్ర ఎ దక్కన్ బిరుదును ఇచ్చి గౌరవించింది.

బత్తుల శ్యాం సుందర్ తెలంగాణ ఉద్యమంపై కూడా తనదైన ముద్ర వేశాడు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి దారి తీసిన నీళ్ళు, నిధులు, నియామకాల ఆవశ్యకతను వివరిస్తూ అప్పటి ప్రధాన మంత్రికి అనేక సార్లు ఉత్తరాల ద్వారా తెలియజేశాడు. విద్యావేత్తగా, మేధావిగా ఆయన ఆనాటి ఉద్యమకారుల పక్షాన నిలబడ్డాడు. తన యవ్వనాన్ని, శక్తియుక్తులను, ఆస్తులను సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించిన శ్యామ్ సుందర్ తన చివరి రోజుల్లో కడు పేదగా మిగిలిపోయాడు. నిజాం నవాబుతో సాన్నిహిత్య సంబంధమున్నా, ఎందరో ప్రముఖులు, ఉన్నత్యోద్యోగులతో సంబంధాలున్నా, సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నా తన చివరి రోజుల్లో పేదరికం వెంటాడుతున్నా ఎవరినీ పైసా అడగని నైజం ఆయనది.

పెళ్ళి తన ఉద్యమానికి అడ్డంకిగా మారుతుందేమోనని భావించిన శ్యాం సుందర్ బ్రహ్మచారిగా మిగిలిపోయిన ఉద్యమ బాటసారి. పదవులున్నా, హోదాలున్నా హంగులు ఆర్భాటాలు లేకుండా అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన నిరాడంబరుడు. అంబేడ్కర్ సిద్ధాంతం, ఆశయాల కోసం, అంబేడ్కర్ కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లే సమ సమాజ స్థాపన కోసం అనునిత్యం పరితపించిన తపస్వి. అంబేడ్కరిజమే ఆయువుగా చేసుకొని జీవించిన శ్యామ్ సుందర్ 19 మే 1975 గుండె పోటుతో మహా పరినిర్వాణం చెందారు. వెలివేయబడ్డ గుడిసెల్లో వేగు చుక్కై వెలసిన వెలుగు రేఖ, విజ్ఞాన గని, నిస్వార్థి, నిరాడంబరుడు, నిఖార్సైన అంబేడ్కర్‌వాదికి నిలువెత్తు రూపం బత్తుల శ్యాం సుందర్.

డా. మంచాల లింగ స్వామి
8099222020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News