బిజెపికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకురావాలని సూచించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని లోక్‌సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల ఎంఎల్‌సి కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమని అన్నారు.
రాష్ట్రం నుంచి 8 మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పోరాటం చేస్తున్నాం : ‘బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు’ అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కెసిఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కెసిఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. బయ్యారం ప్రాంతంలో లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని, అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచనని పేర్కొన్నారు.
10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బిజెపి హామీని అమలు చేయడం లేదని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని ఎంఎల్‌సి చెప్పారు. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వం సాకు చూపిస్తోందని ఆరోపించారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను ఛత్తీస్‌ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కెసిఆర్ మాట్లాడారని తెలిపారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఎంఎల్‌సి కవితను కలిసిన తెలంగాణ సగర, వంశరాజుల సంఘం నాయకులు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను గురువారం నాడు తన నివాసంలో తెలంగాణ సగర, వంశరాజుల సంఘాల నాయకులు వేర్వేరుగా కలిశారు. ఇటీవల డెడికేటెడ్ కమిషన్‌కు బిసి కుల గణనపై నివేదిక సమర్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్ల శివ శంకర్ యుపిఎఫ్ నాయకులు వంశ రాజ రాష్ట్ర అధ్యక్షులు, ఇదిగిచ్చే మురళీకృష్ణ చిందం పాండు నిమ్మల వీరన్న, సగర సంఘ రాష్ట్ర అధ్యక్షులు శెన్ శెట్టి విజయేంద్ర సాగర్, ఎస్‌పి శ్రీను సాగర్, బోశెట్టి భాస్కర్ సాగర్, శ్రీధర్ సాగర్ , గోపి సాగర్, చెన్నయ్య సాగర్, సిద్ది రాములు సాగర్ పాల్గొన్నారు. అయితే, తమ సమస్యలపై శాసన మండలిలో ప్రస్తావించాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్ సాగర్ విజ్ఞప్తి చేశారు.
14న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి తెలంగాణ సంస్కృతి, అస్థిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేయడం, అధికారిక ఉత్సవాలు, వేదికలపై విష సంస్కృతిని ప్రవేశపెట్టడంపై ఈ నెల 14వ తేదీన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంఘాల నాయకులు పాల్గొననున్నారు.