Monday, January 20, 2025

హైదరాబాద్ యూనివర్శిటీలో బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శనపై విచారణకు ఆదేశం!

- Advertisement -
- Advertisement -
‘హైదరాబాద్ యూనివర్శిటీ ఫ్రాటర్నిటీ మూవ్‌మెంట్ ’ బిబిసి డాక్యుమెంటరీని ప్రదర్శించింది. దానిని 70 నుంచి 80 మంది విద్యార్థులు తిలకించారు.

హైదరాబాద్:  హైదరాబాద్ యూనివర్శిటీకి చెందిన ‘ఫ్రాటర్నిటీ మూవ్‌మెంట్’ బిబిసి డాక్యుమెంటరీ ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ను శనివారం నార్త్ క్యాంపస్‌లోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రదర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషద్(ఎబివిపి) దీనికి అభ్యంతరం తెలుపడమేకాక, వర్శిటీ పాలకవర్గానికి ఫిర్యాదుచేసింది. కాగా యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధి, క్యాంపస్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వివరాలు కోరినట్లు తెలిపారు.

ఇదివరకే కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ను బ్లాక్ చేయాల్సిందిగా యూటూబ్‌కు, ట్వీట్ లింక్‌లను తొలగించాల్సిందిగా ట్విట్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. ఇదిలావుండగా ఎబివిపి ఈ ప్రదర్శనపై ఇంకా పోలీస్‌లకు ఫిర్యాదు చేయలేదు. ఎబివిపి సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థి బి. శ్రవణ్ రాజ్ ‘ఇప్పటి వరకైతే మేము పోలీసుల వద్దకు పోలేదు. ఈ అంశంపై నిరసన ప్రదర్శించలేదు. మేము యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వరకే వెళ్లాము. ఈ అంశంపై యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మిన్ మౌనంగా ఉంది’ అన్నారు.

బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్, డిస్కషన్‌ను ‘ఫ్రాటర్నిటీ మూవ్‌మెంట్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్’ చేపట్టింది. ఓ ప్రకటన కూడా చేసింది. డాక్యుమెంటరీ ప్రదర్శనను దాదాపు 70 నుంచి 80 మంది విద్యార్థులు చూశారు. ఇదిలావుండగా హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి గోపి స్వామి ‘క్యాంపస్ బయటి వారు తప్పుదారి పట్టిస్తున్నారు’ అని అన్నారు. ‘డాక్యుమెంటరీని శనివారం ప్రశాంత వాతావరణంలోనే ప్రదర్శించారు. దానిపై ఎలాంటి అభ్యంతరం లేక ఉద్రిక్తత ఏర్పడలేదు. ఆ డాక్యుమెంటరీని కొన్ని ప్లాట్‌ఫారాలలో బ్లాక్ చేశారు. కానీ నిషేధించలేదు. కానీ మా క్యాంపస్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితి పట్ట నేను ఆందోళన చెందుతున్నాను’ అని స్వామి అన్నారు. అతడు అంబేద్కర్ విద్యార్థుల సంఘం(ఎఎస్‌ఎ) సభ్యుడు.

‘కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏజెంట్‌గా ఎబివిపి ప్రవర్తించడం మానుకోవాలి’ అని హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు, ఎస్‌ఎఫ్‌ఐ సభ్యుడు అభిషేక్ నందన్ అన్నారు. ‘ఒకవేల డాక్యుమెంటరీ ప్రదర్శనపై విద్యార్థులపైన ఏదైనా చర్య చేపడితే మేము వారికి అండగా నిలబడతాం. ఆ డాక్యుమెంటరీని ఏ నిషిద్ధ సంస్థ రూపొందించలేదు. పైగా ఓ మీడియా సంస్థయే రూపొందించింది. పైగా దానిని ప్రభుత్వం కూడా నిషేధించలేదు. కోర్టు కూడా నిషేధించలేదు. యూనివర్శిటీ క్యాంపస్‌లో చర్చలు, డిబేట్లను ప్రోత్సహించే సంస్కృతిని ప్రోత్సహిస్తారని మేము భావిస్తున్నాము’ అని అతడు చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News