న్యూఢిల్లీ: రూ. 40 కోట్ల ఆదాయాన్ని తక్కువ నివేదించినందుకు బిబిసి తప్పనిసరిగా సవరించిన ఐటి రిటర్నులను దాఖలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సిబిడిటి) అధికారి తెలిపారు. భారత దేశంలో పన్ను ఎగవేత, విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘనలపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) చిక్కులో ఇరుక్కుంది. పన్ను ఎగవేత విషయంలో బిబిసిపై ఆదాయపు పన్ను శాఖ చర్య ఖచ్చితంగా సాక్షాధారాలపై ఆధారపడి ఉంది. దీనిని ఆ బ్రాడ్‌కాస్టర్ అనధికారికంగా అంగీకరించారు. అయితే దానికి సంబంధించిన అధికారిక విధానాన్ని ఇంకా అనుసరించలేదు. పేరు తెలుప నిరాకరించిన ఇద్దరు అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.
ఆదాయపు పన్ను డిపార్టుమెంటుకు పంపిన ఈమెయిల్‌లో బిబిసి ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అంగీకరించింది. ఇది ‘పన్ను ఎగవేత’ కింద రికవరీ, జరిమానాను ఆకర్షించొచ్చు. బిబిసి అధికారిక మార్గాన్ని అనుసరించి అనేక కోట్ల రూపాయల బకాయిలు, జరిమానాలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అని ఓ అధికారి తెలిపారు.
ఓ సీనియర్ అధికారి ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్ నిధులు అందించే బ్రాడ్‌కాస్టర్ సంస్థ తన పన్ను రిటర్నులలో సుమారు రూ. 40 కోట్ల ఆదాయాన్ని తక్కువ చూపినట్లు ఒప్పుకుంటూ సిబిడిటికి ఈమెయిల్ పంపింది. ‘ఈమెయిల్‌కు చట్టపరమైన పవిత్రత లేదు. దీనిని సీరియస్‌గా తీసుకోవాలంటే బిబిసి రివైజ్డ్ రిటర్నును ఫైల్ చేయాల్సి ఉంటుంది’ అని సిబిడిటి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
బిబిసి మొదట ఆదాయపు పన్ను శాఖ చర్యను ప్రభుత్వ ప్రతీకారం అని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గుజరాత్ అల్లర్ల వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కారణంగానే ప్రభుత్వం తమపై ప్రతీకార చర్యకు దిగుతోందని తెలిపే ప్రయత్నం చేసింది. ‘ఇప్పుడు వారు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతలో పాల్గొన్నారని అనధికారికంగా అంగీకరిస్తున్నారు’ అని అధికారి తెలిపారు.
ఫిబ్రవరి మధ్య కాలంలో ఆదాయపు పన్ను శాఖకు చెందిన బృందాలు న్యూఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయంలో పన్ను ఎగవేత ఆరోపణలపై ‘సర్వే’ నిర్వహించాయి. దానిని ఓ ఆంగ్ల దినపత్రిక ఫిబ్రవరి 14న నివేదించింది. పన్ను ఎగవేత కేసును పన్ను అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పుడు, బిబిసి అధికారులకు ‘పూర్తిగా సహకరిస్తున్నట్లు’ తెలిపింది. వీలయినంత త్వరగా పరిస్థితిని పరిష్కరించనున్నట్లు భావిస్తోంది.