Thursday, November 14, 2024

గడువు పొడిగించండి : బిసి హక్కుల సాధన సమితి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిసి కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకానికి దరఖాస్తు గడువును పొడిగించాలని బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు గడువు పొడిగించేది లేదని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించడం బిసిలకు తీరని అన్యాయం చేయడమేనని ఆయనన్నారు. దరఖాస్తు గడువును జూలై 20 వరకు పొడిగించాలని ఆయన కోరారు. బిసిల్లోని అన్ని కులాలకు ఈ పథకం వర్తింపజేయాలని కోరారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో ఎలాంటి జాప్యం జరగటం లేదని ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయనన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీ సేవా కేంద్రాల్లో, తహసిల్ కార్యాలయాల్లో బిసి కుల వృత్తి దారులు ఆయా సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి మండుటెండలలో తిరుగుతూ పడుతున్న బాధలు మంత్రికి కనబడటం లేదా అని వెంకట్రాములు ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా బిసిలకు ఏమీచేయని ప్రభుత్వం ఎన్నికల సమయం రాగానే ఆర్భాటంగా ప్రతి బిసి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అంటూ ప్రకటించి చివరకు బిసిల్లోని 15 కులాలకు మాత్రమే పథకాన్ని వర్తింపచేసి తూతూ మంత్రంగా కొద్దిమందికి అందజేసి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉండడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి దరఖాస్తులు చేసుకునే గడువును జూలై 20 వరకు పొడిగించాలని, బిసిల లోని అన్ని కులాల వారికి ఈ పథకాన్నివర్తింపచేయాలని కోరారు, బిసి బందు ప్రకటించి అమలు పరచాలనిప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News