Saturday, February 22, 2025

‘బిసి’ పదం ఒక మతం సొత్తా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన జరిపించి ఆ లెక్కలను బయటపెట్టింది. తెలంగాణలోని సుమారు మూడున్నర కోట్ల జనాభాలో 56.33% వెనుకబడిన కులాలవారు ఉన్నారని తేల్చింది. ఇందులో బిసి – ఎ, బి, సి, డి గ్రూపులకు చెందిన జనాభా 46.25% కాగా, బిసి ఇ కేటగిరి జనాభా 10.08% ఉందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. ఎ, బి, సి, డి గ్రూపుల్లో హిందువులకు చెందిన శ్రామి క కులాలవారితోపాటు దూదేకులవాళ్లు, దళిత క్రైస్తవులు కూడా ఉన్నారు. బిసి ‘ఇ’ గ్రూపులో తురక చాకలి, తురక మంగలి, ఫకీర్లు, తురక కాషోళ్లు లాంటి పేద ముస్లిం కులాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో ముస్లింలు 12.56 % ఉండగా, కులగణనలో 10.8% మందిని బిసిల్లో చూపారు. ఉన్నారు. వీరికి ‘ఇ’ కేటగిరి ఫలాలు అందగా, మిగితా ముస్లింలు వారి ఆర్థిక పరిస్థితి బట్టి ఇడబ్ల్యుఎస్ కోటాలో అర్హత పొందుతారు.

మతాలను పక్కనబెడితే సామాజికంగా వెనుకబడిన తరగతుల కేటగిరిలోని బతుకులన్నీ ఒక్కటే. ఏ దేవుణ్ణి మొక్కినా వీరంతా శ్రమను నమ్ముకొని బతుకుతున్నవాళ్ళే. ఏ గ్రూపులో ఉన్నా వెనుకబడినవారి అందరి ఆర్థిక పరిస్థితి ఒక్కటే. కులగణన వివరాల ప్రకటన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల విమర్శలను ఎదుర్కొంటోంది. 2014లో తమ ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో బిసిలు 51% ఉండగా, పదేళ్లలో 5% ఎలా తగ్గింది అని బిఆర్‌ఎస్ అడుగుతోంది. దానికి జవాబుగా సర్వేలో పాల్గొనని మిగిలిన 3% జనాభాకి మరో అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. దీనితో విమర్శ తగ్గే అవకాశం కొంత ఉంది. బిసి జనాభా ఎలా తగ్గిందని కొన్ని వర్గాలు స్పష్టత కోరుతుండగా, బిజెపికి చెందిన నాయకులు కొత్త ప్రశ్న వేస్తున్నారు. బిసిల్లో ముస్లిం కులాలను ఎలా కలుపుతారు అంటూ ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని వల్ల హిందూ సమాజానికి ఏదో ద్రోహం జరిగిపోయింది అన్నంత ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వారి దృష్టిలో, వాదనలో బిసిలు అంటే హిందువులే తప్ప మరే ఇతర మతాలవారు అందులో ఉండకూడదు. ముస్లింలను బిసిల్లో ఎలా కలుపుతారు. దీనికి హిందూ సమాజం అంగీకరించదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదేపదే అంటున్నారు. బిసిలకు చెందిన అన్ని ప్రయోజనాలు, రాయితీలకు హిందువులు మాత్రమే అర్హులు అని వారి వాదన. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు ఎప్పుడొచ్చినా తన ప్రసంగంలో ఈ ఒక్క మాటను చెప్పకుండా తిరిగి వెళ్ళలేదు.‘తెలంగాణలో తమ పార్టీకి అధికారమిస్తే ముస్లిం రిజర్వేషన్లను వెంటనే రద్దు చేస్తాం’ అని ఎంతో హుషారుగా అంటుంటారు. నిజానికి అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాదు. ఇక్కడి ముస్లింలకు లభిస్తున్న కోటాపై కోపముంటే స్వయంగా బిసిలే ఆ డిమాండ్‌ను లేవనెత్తేవారు. తెలంగాణ బిసి నేతలు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లారు తప్ప బిసి ముస్లిం ప్రయోజనాలకు ఎన్నడూ అడ్డుపడలేదు.

కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి ముస్లింలను బిసిల్లో కలపడం రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. ఈ కలయిక బిసి వర్గాల ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. బిసిల్లో హిందూ బిసిలు, ముస్లిం బిసిలు ఉంటారా అని ఎద్దేవా చేశారు. బిసిల లెక్క తేల్చుతామని రాష్ట్ర ప్రభుత్వం అందులో ముస్లింలను కలిపేయడమే పెద్ద తప్పు అంటున్నారు. బిసి అనే పదం ఒక హిందువుల సొత్తుగా మంత్రి భావించడం వింతగా ఉంది. హిందూ మతం మాదిరే ఇస్లాం కూడా ఒక మతం అని అందరికీ తెలుసు. అందులోనూ పై, కింది కులాలు, వృత్తులవారు, శ్రామికులు ఉన్నారు. జాబితాలో బిసి ముస్లింల కులాలను చూస్తే వారి ఆర్థిక పరిస్థితి ఎవరైనా ఊహించవచ్చు. మతం వేరే తప్ప జీవితావసరాల్లో హిందూ, ముస్లిం బిసిల పరిస్థితి అంతా ఒక్కటే. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడని బిజెపివాళ్లు అంటుంటారు. కులాల ఆధారంగానే రిజర్వేషన్లు పుట్టాయి.

ఆ కులాలు అన్నీ ఒక మతం నుంచి వచ్చినయే కదా! ఇప్పుడు హిందూ బిసి గ్రూపుల్లో ముస్లిం పేదలను చేర్చడం కుదరదు. అందుకే విడిగా ఈ గ్రూప్ కావలసి వచ్చింది. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ వాదన మరింత వింతగా ఉంది. కులగణనలో బిసిల లెక్కల్లోంచి ముస్లింలను తొలగించపోతే మా ప్రభుత్వం దాన్ని ఆమోదించదు. ఒకవేళ తొలగిస్తే మాత్రం రాష్ట్రంలోని బిజెపి నేతలందరం కలిసి కేంద్రాన్ని ఒప్పించి రాజముద్రను వేయిస్తామని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ, చట్టబద్ధ్దంగా కాకుండా సభ్యుల ఇష్టాయిష్టాలకు, విశ్వాసాలకు అనుగుణంగా తీసుకోవచ్చు అన్నట్లుగా ఆయన వాదన ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొత్తగా బిసిల్లో ముస్లింలను కలపలేదు. హిందువులు, ముస్లింల్లోని వెనుకబడిన తరగతులను కలిపి లెక్కించి మొత్తంగా ఈ వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు ఉండాలని మండల్ కమిషన్ స్పష్టమైన సిఫార్సులు చేసింది. హిందూ కులాల్లో వెనుకబడిన తరగతులను నిర్ధారించటానికి ఏ ప్రమాణాలను అనుసరించిందో వాటినే ముస్లింలకూ వర్తింపచేసింది. కమిషన్ సిఫార్సులకు సుప్రీంకోర్టు ఆమోదం కూడా లభించింది.

హిందువుల్లో బిసిలు 50 శాతానికి పైగా ఉంటారని మండల్ కమిషన్ చెప్పలేదు. హిందూ బిసిలను 43.70 శాతంగానే పేర్కొంది. ఇతర మతాల్లోని వెనుకబడిన తరగతులను 8.40 శాతంగా నిర్ధారించింది. అలా మొత్తంగా బిసిలను 52 శాతంగా లెక్కగట్టి 27 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది. మండల్ కమిషన్ నివేదికలో బిసిలుగా పేర్కొన్న ముస్లింలు అప్పటి నుంచి కేంద్రంలో ఒబిసి జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ముస్లింల్లోని వెనుకబడిన తరగతులను కేంద్ర జాబితాలో చేర్చారు. కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు ఒబిసి కోటా కింద పేద ముస్లిం కుటుంబాలకు చెందినవారు లబ్ధి పొందుతుండగా, రాష్ట్రంలో ముస్లింలను బిసిల్లో ఎలా కలిపి చూపుతారు అనే ప్రశ్నకు అర్థమే లేదు. ముస్లింల ఓట్లు మాకు రాలవు, మాకు వాటి అవసరం కూడా లేదు అనే భావన బిజెపి నేతలకు ఉండవచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్నవారు రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఉండాలి.

బి. నర్సన్ 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News