Monday, December 23, 2024

కాంగ్రెస్, బిజెపి మ్యానిఫెస్టోల్లో బిసి బిల్లు అంశాన్ని చేర్చాలి : ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రకటించనున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో బిసి బిల్లు అంశాన్ని చేర్చాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ప్రస్తావన ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పొందుపరుచాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఈ పార్టీల ఆధిపత్యం ఉండదని, బిసిలకు 50 శాతం సీట్లు వస్తాయని తెలిపారు. దేశంలోని బిసిలందరూ బిసిలకు రాజ్యాధికారంలో వాటా కోరుతున్నారన్నారు. ప్రతి ఎన్నికల ముందు బిసిలు టికెట్ల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సి వస్తోందని, సభలు పెట్టి ఒత్తిడి తేవాల్సి వస్తుందని కృష్ణయ్య అన్నారు. గత 76 సంవత్సరాలుగా బిసిలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని, కనీసం బిసి డిక్లరేషన్ లో రాజకీయ రిజర్వేషన్‌ల ప్రస్తావన పెడితే ఆ పార్టీపై కొంత నమ్మకం ఏర్పడేదని అన్నారు. కాంగ్రెస్ – బిజెపిలు బిసి బిల్లు పెట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు.
బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు ప్రజాస్వామ్య హక్కు
ప్రజాస్వామ్య దేశాలలో బిసిలకు జనాభా ప్రకారం విద్యా,ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాటా దక్కాలని, ఇది రాజకీయ రాజ్యాంగ బద్ధమైన హక్కు అని ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజకీయ రంగంలో 75 సంవత్సరాల కాలంలో బిసిల ప్రాతినిద్యం 14 శాతానికి దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటివల సేకరించిన గణాంకాల ద్వారా తెలిoదన్నారు. బిసిలకు విద్యా- ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నా రాజకీయ రిజర్వేషన్లు లేవన్నారు. బిసిలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. బిసిలను బిచ్చగాళ్ళను చేశారని మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం రెండు సిఫార్సులు మాత్రమే అమలుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా 38 సిఫార్సులు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. బిసిల విద్య – ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ ను తొలగించాలని, కేంద్రంలో బిసిలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలన్నారు. హై కోర్టు -, సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి – రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు కోల జనార్ధన్, నీలం వెంకటేష్, నంద గోపాల్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News