మనతెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంట్‌లో బిసి బిల్లును ప్రవేశపెట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం 36 బిసి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, 40 కుల సంఘాల నాయకులు సమావేశమై బిసిభవన్‌లో చలో పార్లమెంట్ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరపాలని, 30న ఢిల్లీలో అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
31న మంత్రులను, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులను బిసిల డిమాండ్ల పరిష్కారానికి వత్తిడి తేవాలని నిర్ణయించామని తెలిపారు. దేశంలోని 75 కోట్ల మంది బిసిలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అణచి వేస్తుoదన్నారు. పేద కులాలకు న్యాయం జరగకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బిసిలను అణచివేస్తున్న విధానాలను కేంద్రం మార్చుకోకపోతే అంతర్జాతీయ వేదికల ద్వారా దేశంలో బిసిలను ఎలా తొక్కి పెడుతున్నారో చాటి చెబుతామన్నారు. బిసిలు అందరూ కలసి కట్టుగా పోరాడే సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో బిసి సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, అనంతయ్య, కృష్ణయాదవ్, వేముల రామకృష్ణ, భుపేష్ సాగర్, ఉదయ్‌కుమార్, నిరంజన్, కమ్మదనం శివకుమార్ పాల్గొన్నారు.