బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ ఓటర్లకు జాజుల బహిరంగ లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఎంఎల్‌సి ఎన్నికల్లో బిసి అభ్యర్థులను గెలిపించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయ న బహిరంగ లేఖ రాశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టి చిరంజీవులుతో కలిసి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎంఎల్‌సి ఎన్నికలను రాజకీయ పార్టీలు మొదట్లో తక్కువ చేసి చూపాయని, తాము 22 జిల్లాలు పర్యటించి బిసిలను సంఘటితం చేయడంతో అవి అత్యంత క్రియాశీలకంగా మారాయని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారం చేయలేదని, తొలిసారిగా రేవంత్‌రెడ్డి ప్రచారం చేయడం ఎంఎల్‌సి ఎన్నికల ప్రాధాన్యతను తెలియజేస్తోందని అన్నారు.
ఎంఎల్‌సి ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు, బిసిల రాజకీయాలకు దశ, దిశ నిర్దేశించబోతున్నాయని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచే సామాజిక వర్గమే 2028లో అధికారం చేపట్టబోతోందన్నారు. ఓటు మనదే, సీటు మనదే అనే నినాదంతో ఈ నెల 17 నుంచి ప్రచారం చేస్తున్నామని, రాజయకీయ పార్టీలకు అతీతంగా బిసి అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. రాజకీయాల కతీతంగా ముగ్గురు బిసి అభ్యర్థులు గెలువబోతున్నారని, సిఎం ప్రచారానికి రావడం, ఈ ఎన్నిక పెద్ద క్రైటీరియా కాదు, గెలుపు ఓటములు సాదారణమే అని నిజామాబాద్ సభలో సిఎం చెప్పడం బిసి అభ్యర్థులు గెలుపు ఖాయమని చెప్పకనే చెప్పారని జాజుల అన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలు ఏకమై రెడ్ల పాలనకు చరమగీతం పాడుదామని జాజుల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపోతున్నాడని, అందుకే ఓట్లను నోట్లతో కొనాలని చుస్తున్నారని ఆరోపించారు. బిజెపి తరఫున ఉన్న అంజిరెడ్డి అవకాశ వాది అని ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికలు రెడ్డి వర్సెస్ బిసిలుగా జరుగుతున్నాయన్నారు. సర్వే సంస్థలు, ఇంటలిజెన్స్ సైతం బిసి అభ్యర్థులు గెలుస్తున్నట్లు చెప్పాయన్నారు. ముగ్గురు బిసిలను గెలిపిస్తే రెడ్డి వెలమ కాకుండా సిఎం పీఠంపై బిసి కూర్చుంటాడని జాజుల తెలిపారు. ఈ సమావేశంలో బిసి కుల సంఘాల జెఎసి ఛైర్మన్ కుండారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బిసి విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బిసి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్, బిసి యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బిసి జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నాగేష్ , జాజుల లింగం గౌడ్, సదానందం, రావులకోల్ నరేష్ ప్రజాపతి, సత్యం గౌడ్, నరసింహ నాయక్, బుర్ర శ్రీనివాస్, వెంకటేష్, పవన్ సాయి, భరత్ తదితరులు పాల్గొన్నారు.