Friday, December 20, 2024

నాయకులకు అందలం జనులకు అథఃపాతాళం

- Advertisement -
- Advertisement -

దేశమంతా సమగ్ర కులగణన చేపట్టని పార్టీ నుంచి వెనుకబడిన కులాల ప్రతినిధి ఆర్ క్రిష్ణయ్య పెద్దల సభకు పంపారు. మొన్నటి వరకు వైసిపిలో ఎంపిలుగా వెలగబెట్టిన ఆర్ క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు కండువా మార్చి తెలుగుదేశం, బిజెపి పంచనచేరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన పార్టీ కనీసం లక్ష ఉద్యోగాలు కూడా భర్తీచేయలేని పరిస్థితి. 8 శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఇబిసి రిజర్వేషన్ కల్పించారు. ఉన్న అరకొర నియామకాల్లో ఇబిసి వర్గాలకు ఒబిసిల కంటే తక్కువ కటాఫ్ మార్కులతో వెనుకబడిన వర్గాలకు శరాఘాతంగా మారింది.

దేశంలోని అన్నిరాష్ట్రాలలో బిసి కులగణన జరగాల్సిందేనని బిసి ఉద్యమకారులు, దళిత ప్రజాతంత్ర వాదులు, వామపక్షాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కులగణన అనేది జరిగితే ఎవరు , ఎంత శాతం ఉన్నారో తెలుస్తుంది. జనాభాలో 54 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు కేవలం 27% రిజర్వేషన్ కల్పించారు. జనాభా 54% ఉన్నా అన్నిరంగాల్లో వెనుకబడిపోయారు. చట్టసభల్లోనే కాదు గ్రామ, మండలస్థాయి ప్రాతినిధ్యం లేని కులాలు అరవై శాతం వెనుకబడిన తరగతులు ఉన్నాయి. బిసి కులగణన చేపట్టకుంటే కేంద్రంలోని బిజెపి సర్కారుతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మేధావులు హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్లను ఎత్తేసేలా కేంద్రం వైఖరి స్పష్టంగా ఉంది. బిసి కులగణన చట్టం అనుమతిస్తుందని, కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి.

బిసి జనాభా లెక్కలు లేకుండా దేశంలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఎలా చేస్తారు? కులాల లెక్కలు తేల్చితే విద్యావంతులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో తేలుతుంది. దేశసామాజిక, ఆర్థిక ముఖచిత్రం కూడా తెలుస్తుంది. కులగణన జరిగితే రిజర్వేషన్లు పెంచాలని బిసిల నుంచి డిమాండ్ వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బిజెపి సర్కారు ఆ పని చేయడంలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏమంటే ప్రతిపక్షం, అధికార పార్టీలు బిజెపితో అంటకాగి తిరుగుతున్నాయి. గతంలో ఇడి బ్యాంకులను ముంచడం లో ప్రధాన పాత్ర పోషించిన తెలుగుదేశం నాయకులు బిజెపిలో చేరి పునీతులైనారు. పన్నెండు సంవత్సరాల క్రిందట జన్ లోక్‌పాల్ బిల్లు పెట్టడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రధాన భూమిక పోషించిన గాంధేయవాది అన్నాహజారే ప్రియశిష్యులు నేడు లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

సామాన్య మదుపరుల ఆస్తులు లక్షల కోట్లు ఆవిరవుతున్నా, ఎల్‌ఐసి, బ్యాంకింగ్ రంగం కుదేలవుతున్నా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ప్రతిపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం చలనం లేదు. దేశంలో కులగణన చేపట్టకుండా, సామాజిక సమగ్రత లేకుండా, మహిళలపై, ముస్లింలపై, రైతులపై, కార్మికులపై దాడులు జరుపుతున్నా బిజెపి పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిష్ణయ్య ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ప్రభుత్వంపై నోరుమెదపని బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకట రమణ లాంటి నాయకులను ఏమనాలి? జాతీయ ప్రయోజనాలు మరుగుపడినచోట ఉత్పాతాలే మిగులుతాయి. పాఠం నేర్వకపోతే ఏ దేశమైనా మునగక తప్పదు. మన దేశంలో ఆర్థిక వృద్ధి అంచనాలు గత నాలుగు సంవత్సరాలుగా పేలవంగా ఉన్నాయి. ఉద్యోగాలు సృష్టించటమనేది ప్రభుత్వానికి ఎదురయ్యే అతిపెద్ద అవరోధంగా ఉంది. జనాభా రీత్యా ప్రపంచంలో అతిపెద్ద దేశంగా భారతదేశం తన యువ కార్మికశక్తిని ఇముడ్చుకోవాలంటే ఏటా 1.30 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది.

అయితే 2016 నవంబర్‌లో చేసిన నోట్ల రద్దు దెబ్బకు కుదేలైన చిన్న వ్యాపారాలపై జిఎస్‌టి అమలుతో మరోసారి గట్టి దెబ్బతిన్నాయి. వాటితో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది, ప్రత్యేకించి అసంఘటిత రంగంలోవారు ఉద్యోగాలు కోల్పోయారు. దేశంలో వ్యవసాయం, నిర్మాణ రంగం, చిన్నపరిశ్రమలు, అతిపెద్ద ఉద్యోగ రంగాలు. ఎందుకంటే కార్మికశక్తి ఎక్కువ అవసరమైన రంగాలవి. కానీ ఈ మూడు రంగాలూ ఇటీవలి సంవత్సరాలలో ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వృత్తిదారుల బతుకులు ఉన్నత స్థితికి చేరాల్సిందిపోయి నీచస్థితికి చేరడం మొదలైంది. ప్రజలంతా వారి కులలెక్కలు తీయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బిసి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. రూపాయి ఖర్చు లేకుండా కులగణన చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. బిసి జనాభా లెక్కలు బయటకు వస్తే దోపిడీ చేసేవారు అడ్డుకట్ట పడుతుంది.

అందుకే లెక్కలు బయటకు రాకుండా ఆ వర్గాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. బిసిల పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవాలి. దేశంలో ఒబిసిల్లో 983 కులాలకు ఐదేండ్లు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు అందట్లేదు. ప్రధాని మోడీ నేతృత్వంలో చేతగాని పాలన సాగుతున్నది. వ్యవస్థలన్నీ పతనమైపోయాయి. నిరుద్యోగం 8.4% పెరిగింది. ప్రభుత్వరంగ సంస్థలు దివాళా తీసేలా చేస్తున్నారు. ఇన్సూరెన్స్, రైల్వే, కమ్యూనికేషన్, చివరికి ఇస్రో, హెచ్‌ఎఎల్ ప్రైవేటుపరం చేస్తున్నారు. దేశజనాభాలో 54% బిసిలే ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం బాధాకరం. కులాల లెక్కలు తీయకపోతే బిజెపి గద్దె దిగిపోవాల్సిందే. ఇప్పటివరకు వారి వాటాతో పాటు బిసిలకు వచ్చే వాటా కూడా అనుభవిస్తున్నారు.

కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమ ప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4)లో స్పష్టంగా పేర్కొనబడింది. ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమేనని, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇబిసి వర్గాలకు ఎక్కడ నుండి వచ్చింది. రిజర్వేషన్‌కు ప్రాతిపదిక సామాజిక వెనుకబాటు మాత్రమే. కేంద్రంలో బిజెపి ఉన్నప్పటి నుంచి అంతా తారుమారు అవుతుంది. మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఒబిసిల జనాభా 54% , అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి 10% రిజర్వేషన్లా? అసలు ఏ లెక్కల ప్రకారం 10% కేటాయించారు అనే దానిపై చర్చ జరిగినట్లు లేదు.

తీర్పు వెలువరించే ముందు ఒసిల జనాభాను సుప్రీం శాస్త్రీయ లెక్కలు లేవు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. రిజర్వేషన్లు 50% దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు వెనుకబడిన తరగతులు అనుకూలంగా మలచుకుని జనాభా దామాషా ప్రకారం బిసిలకు 54% రిజర్వేషన్ల కోసం పోరాడాలి. సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని కులాల లెక్కలు తీయాలి. వేరే అంశాలు పక్కన పెట్టి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. అన్ని సామాజిక, రాజకీయ శక్తులు ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్రంగా కృషి చేయాలి. భారత దేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా మార్చే ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఐక్య ఉద్యమాలు నిర్మించాలి.

ముచ్చుకోట సురేష్ బాబు
99899 88912

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News