Friday, December 27, 2024

బిజెపికి కలిసిరాని బిసి సిఎం

- Advertisement -
- Advertisement -
ఎస్సీవర్గీకరణ హామీ ఇచ్చినా ఆదరించని ఓటర్లు
ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి బాట
ఎంపిలుగా గెలిచిన ఎమ్మెల్యేగా పరాజయం
సత్తా చాటని ఇద్దరు మాజీ మంత్రులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో అధికారం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ హస్తిన అగ్రనాయకత్వం తెలంగాణకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలు జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి తమ పార్టీకి అధికారం కట్టబెడితే బిసి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని, అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి ఎస్సీ వర్గీకరణ ప్రకటన చేసిన దానికి సంబంధించిన విధివిధానాలు ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్ష ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యుపి సిఎం యోగి అథిత్యనాథ్, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర పడ్నవీస్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు వచ్చి మూడు రోజుల పాటు మకాం వేసి విపక్షాలపై విమర్శలు చేసి తాము అధికారంలోకి వస్తే అభివృద్ది, సంక్షేమ పథకాలను అందిస్తామని ప్రజలకు వివరించారు. అయిన నేడు ప్రకటించిన ఫలితాల్లో 8 అభ్యర్థులు గెలుపొందారు.

పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు పోటీ చేసి ఉనికి చాటుకునేందుకు అష్ట కష్టాలు పడ్డారు. 111 స్దానాల్లో బిజెపి పోటీ చేస్తే అందులో ముగ్గురు పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ సీటులో పోటీ చేసి ఓటమి చవిచూశారు. కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి మంత్రి గంగుల కమలాకర్‌రావుపై ఓడిపోయారు. ప్రచారానికి చివరి రోజు ప్రధాని మోడీ బహిరంగసభ పెట్టి హమీలిచ్చిన జనం పట్టించుకోలేదు. అదే విధం గా కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపి దర్మపురి అరవింద్ బరిలో నిలిచి కల్వకుంట్ల సంజయ్ ఓటమి చవిచూశారు. ఆయన గత పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇటీవలే కేంద్రం బోర్డు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అయినా ఓటర్లు వారిని కనికరించలేదు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి సోయం బాపురావు పోటీ చేసి అనిల్ జాదవ్‌పై ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమావేశం నిర్వహించి కేంద్రం ప్రభుత్వం అదివాసీల కోసం అనేక అభివృద్ది పథకాలు ప్రవేశపెట్టామని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చిన ఓటర్లు పార్టీవైపు చూడలేదు. అదే విధంగా 2004 నుంచి హూజురాబాద్‌లో వరుసగా వి జయం సాధిస్తున్న ఈటెల రాజేందర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి పా డి కౌశిక్‌రెడ్డిపై పరాజయం పొందారు. ఆ నియోజకవర్గం నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తరువాత జరిగిన మొదటిసారి 2004లో జరిగిన ఎన్నికల్లో ఈటెల పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఓటమి చవిచూడలేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా విజయం సాధించి బిజెపికి మంచి ఊపు తెచ్చారు. దీంతో ఈటెలకు పార్టీలో సముచితం స్థానం లభించింది. ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. పార్టీ హైకమాండ్ సిఎం అభ్యర్థిగా భావించి రెండు చోట్ల గజ్వేల్, హూజురాబాద్ నుంచి బరిలోకి దించింది. రాష్ట్రమంతటా ఆయన పర్యటన చేపట్టడంతో సొంత నియోజకవర్గాలకు సమయం కేటాయించకపోవడం వల్ల ఓటమి చెందారని అనుచరులు పేర్కొంటున్నారు.

మరోపక్క బిఆర్‌ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్‌రెడ్డి తాను ఈసారి ఓడిపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతానని సభ వేదికలో పేర్కొనడంతో సానుభూతి వీచి ఓటర్లు మద్దతు పలికారని విపక్ష పార్టీ నేతలు చెబుతున్నారు. ఈటెల రాజేందర్ ఓడించిన నాయకునిగా కౌశిక్‌ రెడ్డి గురించి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. వీరితో పాటు గ్రేటర్ నగరంలో సనత్‌నగర్ నుంచి బరిలో నిలిచిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్ది మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఓటమి పాలైయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని ఢిల్లీ పెద్దలకు ఇక్కడ పరిస్ధితులు వివరించి కేంద్రానికి ఒప్పించడంలో ఎంతో కృషి చేశారని ప్రచారం చేశారు. మంత్రి తలసాని తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదని నిజమైన ఉద్యమకారున్ని తానేనని ప్రజలు తనకు మద్దతు పలకాలని కోరినా ఓటమి తప్పలేదు. ఈఎన్నికల్లో బిజెపి తరుపున పోటీ చేసిన హేమాహేమీలు ఓడిపోవడం ఆ పార్టీ భవిష్యత్తుల్లో తెలంగాణలో అధికారం చేపట్టడం కలగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News