Sunday, December 22, 2024

పొన్నంకు బిసి మంత్రిత్వ శాఖ కేటాయింపుపై బిసి సంఘాల హర్షం

- Advertisement -
- Advertisement -

మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన జాజుల

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో బిసి సంక్షేమ శాఖను హుస్నాబాద్ శాసనసభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కేటాయించడాన్ని బిసి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బిసి సంక్షేమం పట్ల పొన్నం ప్రభాకర్ కు ఉన్న చిత్తశుద్ధిని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కొనియాడారు. పొన్నం ప్రభాకర్ గతంలో బిసిల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా బిసి మంత్రిత్వశాఖ ఆయనకు ధక్కి౦దని జాజుల అన్నారు. కొత్త ప్రభుత్వంలో బిసి సంక్షేమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో వివిధ బిసి సంఘాలు, కుల సంఘాల నేతలు ఆదివారం బేగంపేటలోని పొన్నం నివాసంలో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని శాలువాగప్పి, పూల భోకె తో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే బిసి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన చరిత్ర పొన్నం ప్రభాకర్‌కు ఉందని, గతంలో ఆయన పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన సందర్భంలో జాతీయస్థాయిలో బిసి డిమాండ్ల సాధన కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ని పొన్నం నేతృత్వంలో అనేకసార్లు కలువడం జరిగిందని జాజుల గుర్తు చేశారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు జరిగినటువంటి వివిధ బిసి ఉద్యమాలు, పోరాటాల్లో పొన్నం ప్రభాకర్ ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారన్నారు. నికార్సయిన నిజాయితీగల వ్యక్తి కి బిసి సంక్షేమ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పజెప్పడం చాలా శుభ పరిణామమన్నారు. పొన్నం ప్రభాకర్ నియామకం పట్ల బిసిలలోని 136 కులాలు హర్షం వ్యక్తం చేశాయని ఆయన తెలిపారు. బిసిల సర్వతోముఖాభివృద్ధికి పొన్నం ప్రభాకర్ పాటుపడతారనే విశ్వాసం బిసిలలో ఉందని ఆయన అన్నారు. మంత్రిని కలిసిన వారిలో బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారపు గణేష్ చారి, కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, విద్యార్థి సంఘం కేంద్ర అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్. నాయకులు ఎస్ దుర్గ గౌడ్, జాజుల లింగం, వరికుప్పల మధు, గూడూరు భాస్కర్, దేవిక, శ్యామల, నాగరాజు, పాలకూరి కిరణ్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News