రాష్ట్రవ్యాప్తంగా 285 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు
మనతెలంగాణ/హైదరాబాద్ : మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25వ తేదీ (ఆదివారం) ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యబట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు సంస్థ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 285 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. విద్యార్ధులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్ధల్లో మొత్తం 134 జూనియర్ కాలేజీల్లో, ఒక డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం మొదటి సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుందన్నారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశ పెట్టిన వృత్తి విద్యాకోర్సులు (ఒకేషనల్‌కోర్సులు)తో కలిపి ఇంటర్ కోర్సులకు 41,477 దరఖాస్తులు, డిగ్రీ కోర్సుల కోసం 5,367 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 12,700 సీట్లు భర్తీ చేస్తామని అన్నారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులందరూ తమ హాల్ టికెట్‌తో హాజరు కావాలని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షా కేంద్రాలకు రావాలని సూచించారు. ప్రవేశ పరీక్ష కోసం జిల్లా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు వస్తే 040 -23328266 నెంబర్‌కు ఆఫీసు సమయంలో సంప్రదించాలని తెలిపారు.