Wednesday, January 22, 2025

కాంగ్రెస్ మొదటి జాబితాలో బిసి నాయకుల పేర్లు గల్లంతు?

- Advertisement -
- Advertisement -

ఓసీలకే అధిక ప్రాధాన్యం !
అధిష్టానం ఎదుట తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమైన బిసి నాయకులు
అవసరమైతే ఓసీలను ఓడిస్తామని హెచ్చరిక

మన తెలంగాణ/ హైదరాబాద్: కాంగ్రెస్ మొదటి జాబితాపై బిసి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ జాబితాలో ఓసీలకు మాత్రమే చోటు దక్కే అవకాశం ఉందని బిసి నాయకులు సమాచారం అందడంతో ఈ విషయమై సోమవారం బిసి నాయకులు సమావేశం అయినట్టుగా తెలిసింది. మొదటి జాబితా విషయంలో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందంటూ బిసి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే తమ బాధను అధిష్టానానికి తెలియచెప్పాలని భావించిన బిసి నాయకులు రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే మొదటగా విడుదల చేసే జాబితాలో బిసి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలైన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌లతో పాటు పలువురు ముఖ్య నేతల పేర్లు లేవని తెలుస్తోంది.

మొదటి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బిసిల పేర్లు మాయం

మొదటి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బిసిల పేర్లు మొదటి జాబితాలో ఉంటాయని గతంలో టిపిసిసి చీఫ్ పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ దిశగా మొదటి జాబితా మొత్తం ఓసీలతో ఉండడంపై బిసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మకాం వేసిన కొందరు ఓసి నాయకులు ఈ విషయంలో చక్రం తిప్పుతున్నారని, అందులో భాగంగానే బిసి నాయకుల పేర్ల ప్రకటనపై సందిగ్ధత నెలకొందని వారు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులుగా బిసి నాయకుల ఓట్లే కీలకమని ప్రకటించిన కాంగ్రెస్‌కు చెందిన ఓసీ నాయకులు ప్రస్తుతం టికెట్ విషయానికి వచ్చే సరికి ప్లేట్ ఫిరాయిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు బిసి నాయకులకు ఎసరు పడే అవకాశం ఉందని భావిస్తున్న బిసి నాయకులు తమ ఉనికిని చాటుకోవడంలో భాగంగా అధిష్టానం ఎదుట తమ నిరసనను తెలియచేయడానికి సమాయత్తం అవుతున్నారు. కొంత మంది ఓసీ నేతల జోక్యంతోనే బిసిలకు అన్యాయం జరుగుతుందని బిసి లీడర్లు ఆరోపిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని కాపాడుతున్న తమపై వివక్ష చూపితే కాంగ్రెస్ పార్టీకే నష్టమని బిసి నాయకులు బాహాటంగా హెచ్చరిస్తున్నారు.

ఓసిలను ఓడించడానికి తామంతా సిద్ధమే ?

బిసి నేతల టిక్కెట్ల అంశంలో సర్వేలు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఫస్ట్ లిస్టులో వారి పేర్లు లేవని ఢిల్లీ నేతలు ఇప్పటికే బిసి నాయకులతో పేర్కొన్నట్టుగా తెలిసింది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నా ఊహించని విధంగా తమకు ఇలా షాక్‌లు ఇవ్వడం పద్ధతి కాదని, బిసి నాయకులు ఢిల్లీ నేతలతో సోమవారం పేర్కొన్నట్టుగా సమాచారం. పైగా ఒకే అసెంబ్లీ సెగ్మెంట్‌లో బిసిలకు, రెడ్డి అభ్యర్థులకు సర్వేలు చేయడం వల్ల మొదటి నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికే సర్వే అనుకూలంగా ఉంటుందని బిసి నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బిసి నేతలు ఓడిపోయేందుకు పార్టీలోని కొందరు ఓసి సామాజిక వర్గానికి చెందిన లీడర్లు బ్యాక్ గ్రౌండ్‌లో సహకరించారని, ఇదంతా తెలిసినా పార్టీ అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈసారి అలా కాకుండా బిసి నేతలంతా ఐక్యంగా ఢిల్లీ అధిష్టానం వద్ద తమ గళాన్ని వినిపించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ సారి బిసిలకు ఆశించిన స్థాయిలో టిక్కెట్లు ఇవ్వకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను ఓడించేందుకు తాము వెనుకాడబోమంటూ బిసి నేతలు అధిష్టానానికి చెప్పాలని కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News