Friday, November 22, 2024

ఈ నెల 15న హైదరాబాద్ లో బిసిల రాజకీయ ప్లీనరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :బిసిలకు రాజకీయ అధికారమే లక్షంగా ఈ నెల 15న హైదరాబాద్ ఎల్‌బి నగర్ లోని కెబిఆర్ కన్వెన్షన్ లో పదివేల మంది బిసి ప్రతినిధులతో బిసిల రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ప్లీనరీలో బిసిల రాజకీయ పాలసీని ప్రకటిస్తామని వెల్లడించారు. బిసి డిక్లరేషన్ పేరుతో మరోసారి బిసిలను మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గురువారం హైదరబాద్ లోని ఓయులో బిసి సంక్షేమ, యువజన, విద్యార్థి,మహిళ సంఘాల రాష్ట్ర నేతలతో కలిసి బిసిల రాజకీయ ప్లీనరి పోస్టర్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్లీనరీలో రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలు రాజకీయంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించి, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. బిసిలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ టికెట్లు ఇస్తామని చెప్పకుండా రాయితీలు, సంక్షేమ పథకాలతో ‘బిసి డిక్లరేషన్‘ అంటూ బిసిలను మోసం చేయాలని చూస్తున్నాయని జాజుల ఆరోపించారు.

బిసిలు రాయితీలతో రాజీ పడకుండా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, సిఎం పీఠమే అజెండాగా బిసి రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెడతామని, బిసిలను మోసం చేసే పార్టీలను ఎండగట్టి రాజకీయ చైతన్యం రగిలించడానికి ఈ ప్లీనరీ ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు, ప్లీనరీలో చర్చించిన అనంతరం అవసరమైతే బిసిలకు కూడా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. బిసిల రాజకీయ సంఘటిత శక్తిని చాటి చెప్పడానికి వచ్చే 2023 ఎన్నికలు బిసి ఎజెండాగా జరగనున్నాయని, బిసిలు ఆశించే స్థాయి నుండి రాజకీయంగా శాసించే స్థాయికి ఎదగడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడుతుందన్నారు పార్టీలకతీతంగా జరిగే ఈ ప్లీనరీ లో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని శ్రీనివాస్ గౌడ్ సమస్త బిసి సమాజానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ , బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, బిసి విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి, ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ నాయక్, బిసి రాష్ట్ర నాయకులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, మాదేశి రాజేందర్, వరికుప్పల మధు, గూడూరు భాస్కర్, స్వర్ణ గౌడ్, సమత యాదవ్, తారకేశ్వరి, గౌతమి, నాగరాజ్ గౌడ్, మహేష్ గౌడ్, బండి రాజు, భరత్ గౌడ్, మాద శీను తదితరులు పాల్గొన్నారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News