ప్రపంచంలో ఏ దేశంలోలేని కులవ్యవస్థ మన దేశంలోనే ఉన్న ది. వేల ఏళ్లుగా దేశంలోని క్రింది కులాలు ఎన్నోరకాల అన్యాయాలకు, అసమానతలకు గురవుతూనే ఉన్నారు. కుల చైతన్య- అభివృద్ధి ద్వారానే కులరహిత సమాజం ఏర్పడుతుందని ఎంతో మంది మేధావులు వివరించారు. దేశంలో 1931 నాటి జనాభా లెక్కల ప్రకారం 50 శాతం పైగా ఉన్న బిసిల అభివృద్ధికి ప్రభుత్వాల వద్ద నేటికి సమగ్రమైన కార్యక్రమం లేదు. రాజ్యాంగ నిర్మాణ సభ అ సభ్యుడైన “పంజాబ్ రావు దేశముఖ్” రాజ్యాంగాన్ని ఆమోదించిన సమయంలో తన చివరి ఉపన్యాసంలో (1949 )మాట్లాడుతూ భారతదేశంలో బిసిలు అని పిలువబడే అనేకులకు నిష్పపాతంగా రావలసిన న్యాయమైన అవకాశాలను రాజ్యాంగం పొందుపరచలేకపోయింది. స్వాతంత్య్ర ఫలాలను పొందలేకపోయిన ఈ అనేక బిసి కులాలకు ఎస్‌సి, ఎస్‌టి కులాల మాదిరిగా రక్ష, అదనపు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సామాజిక బాధ్యతను విశ్వసించకపోవడం వల్ల భవిష్యత్తులో ప్రమాదకరమైన సంకేతాలు వస్తాయని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు బిసి జనాభా గణాంకాలు సేకరించడంలేదు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న బిసి కుల జనాభా గణాంకాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించే అవకాశమే లేదు. ప్రణాళిక సంఘం తమ వద్ద బిసి కులాల జనాభా వివరాలు లేకపోవడం వలన వారికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు చేయలేకపోతున్నాము అంటుంది.
ఒకవైపు లక్షల కోట్ల రూపాయలతో 10 పంచవర్ష ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని చెబుతూనే మరోవైపు బిసిల జనాభా లెక్కలు లేని కారణంగా బిసి కులాల అభివృద్ధికి ప్రణాళికలు చేయలేకపోయామని చెప్పడం బిసిల అభివృద్ధిపట్ల ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది. ఈ దేశంలో అన్నివర్గాల వివరాలను జనాభా గణన ద్వారా సేకరిస్తున్నారు. చివరకు జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ బిసి కులాల వారీగా జనాభా లెక్కలు లేకపోవడం అన్యాయం. కనీసం జంతువుల మీద ఉన్న ప్రేమకూడా బిసి కులాల మీద ప్రభుత్వాలకు లేకపోవడం అత్యంత బాధాకరం. బిసి జనాభా లెక్కలు సేకరిస్తే నష్టం ఏమిటి అనే ప్రశ్నకు జవాబులేదు.
2010లో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం తెలంగాణలో అగ్ర కులానికి, బిసి, ఎస్‌టి, ఎస్‌టిల ఆదాయంలో అసమానతలు బాగా పెరిగాయని పేర్కొన్నది.ఇటీవల ఒక సర్వేలో 135 కోట్ల భారతీయులు ఉన్న దేశంలో ఒక లక్ష మంది 100 కోట్లకు పైబడిన కోటీశ్వరులు ఉన్నారు. వారిలో 99 శాతం మంది అగ్రకులాల వారే. బిసి, ఎస్‌సి, ఎస్‌టిల వారు కేవలం ఒక శాతం మాత్రమే. దీన్ని బట్టి ప్రజాధనం ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం అన్ని రకాల ఉద్యోగాలలో 65 శాతం అగ్రకులాలు, 15 శాతం బిసిలు, 20 శాతం ఎస్‌సి, ఎస్‌టిలు ఉన్నారు.అర్జున్ సేన్ గుప్తా 66వ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం అసంఘటిత రంగంలో పెద్ద భాగాన బిసిలు నేటికీ పేదరికంలో తక్కువ వేతనంతో దుర్భరమైన పని ప్రదేశాల్లో భద్రత లేకుండా కుటుంబాలకు దూరంగా ఉన్నట్లు తేలింది. బిసిల అభివృద్ధి కొరకు అర్జున్ సేన్ గుప్తా కమిషన్ చేసిన సూచనలను అమలు చేయాలని ప్రణాళికా సంఘం చెప్పినా ప్రభుత్వాలు వాటిని ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. కేటాయింపుల్లో ఏనాడు బిసిల జనాభాకు తగినట్లుగా నిధులు కేటాయింపు జరగలేదు. అన్ని బిసి కులాలను ప్రభుత్వ పథకాల లెక్కలోకి తీసుకోలేదు. సంక్షేమ పథకాల వలన బిసిల జీవన ప్రమాణస్థాయి పెరగకపోగా అసలు బిసిలకు కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయనే విషయం తెలియకుండా పోయింది.
బిసి కులాల్లో నిరుద్యోగం, పెరిగిన జీవన ప్రమాణాలు దుర్భరంగా మారినా ప్రభుత్వాలకు పట్టింపు లేదు. నేటికీ బిసి కులాల్లో ఉన్న రామజోగి, భాగవతులు, సాధనాసురులు, ఆది కొడుకులు, ఎనుటీ, గంజి కూటి, అద్దపువారు, కాకి పడగల, గుర్రపు వాళ్ళు, గంగిరెద్దుల, సరగాని, కడలి సైదారాలు, నక్కల, పాముల లాంటీ 39 కులాలు కుల వ్యవస్థ నిర్దేశించిన భిక్షాటన చేస్తూ కనీసం నివాసం లేక మనుషులుగానైనా గుర్తింపులేక సంచార జీవులుగా తమ బతుకులను ఈడుస్తున్నారు. అంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో కుల వ్యవస్థ ఎంత దుర్మార్గంగా కొనసాగుతుందో గమనించవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 వలన 1951 నాటి తొలి రాజ్యాంగ సవరణ ద్వారా బిసిలకు రిజర్వేషన్ అర్హత లభించినప్పటికీ 1990 మండల కమిషన్ కేసు తీర్పు వచ్చేదాకా దాదాపు 40 ఏళ్లు రిజర్వేషన్లు అమలు చేయలేదు. ఈ మధ్య కాలంలోని ప్రభుత్వ విద్య, ఉద్యోగ తదితర అన్ని నిరంగాల్లో బిసిలకు లభించవలసిన 50 శాతం రిజర్వేషన్ అవకాశాన్ని ఓపెన్ కాంపిటీషన్ పేరిట అగ్రకుల సంపన్న శక్తులే అన్యాయంగా అనుభవించాయి. కనీసం 15 శాతం కూడాలేని కులాలు 80 శాతం పైగా దేశ వనరులను, ప్రభుత్వ వ్యవస్థలను, పరిశ్రమలను, వ్యాపారాన్ని, ఉద్యోగాలను, కాంట్రాక్టులను రాజకీయ అధికారాన్ని తమగుప్పెట్లో పెట్టుకున్నారు. 50 శాతం పైగా ఉన్న బిసి కులాలు అన్నిరంగాలలో వెనకపడినట్లు బయటపడింది.
1953 నాటి మొదటి కాకా కలేల్కర్ బిసి కమిషన్, 1979 నాటి రెండవ మండల్ బిసి కమిషన్లు తప్పని సరిగా బిసి జనాభా లెక్కలు చేపట్టాలని ప్రభుత్వాని కుల గణాంకాలు చేపట్టాలని తమ కమిషన్ రిపోర్టులో పేర్కొన్నారు. అదే విధంగా వివిధ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన అన్ని బిసి కమిషన్లు కూడా జనాభా లెక్కలు చేపట్టాలని పదే పదే చెప్పాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా శాస్త్రీయమైన గణాంకాలు లేకుండా ఏ సామాజిక వర్గానికి ఎలా ఇవ్వాలి అన్న విషయంలో నిర్ణయం తీసుకోవడం కష్టమని చెప్తూనే ఉన్నాయి. 2010 సంవత్సరంలో బిసి కులాల జనాభా లెక్కలు తీయాలని పార్లమెంట్లో దాదాపు అన్ని పార్టీలు పట్టుబట్టగా యుపిఎ ప్రభుత్వం మొదటగా అంగీకరించి తర్వాత మాట మార్చి ప్రభుత్వ శాఖల ద్వారా దేశవ్యాప్త జనాభా లెక్కలను చేపట్టింది. అయితే అందులో తప్పులు దొర్లాయని గణాంకాల వివరాలు బయట పెట్టలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి బిసి కులాల జనాభా లెక్కలు తీయాల్సిందేనని పార్లమెంటులో డిమాండ్ చేసింది. కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 01 ఆగస్టు 2018 నాడు అప్పటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జరిపిన హోం శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో జనాభా గణనలో బిసి కులాలవారీగా లెక్కలు తీయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.
కానీ రెండవ సారి ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి రాగానే మాట మార్చారు. జనాభా లెక్కలు తీస్తే బిసిలు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిస్తేవారు తిరగబడి దేశ వనరులలో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని అడుగుతారేమో అని పాలక వర్గాలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వేల సంవత్సరాలుగా తమ అగ్రకులాలకు సేవ చేస్తున్న ఊడ్చే పని, కడిగే పని ఇంటిపని, వంటపని, పొలం పనులు చేసేవాడు దొరకరని భయపడి జనాభా లెక్కలు చేయడం లేదా? ఇన్ని రోజులు తమ కాళ్ళకాడపడి ఉన్న ఈ కులాలవారు అభివృద్ధి చెంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా తమ పక్కన కూర్చుంటారని భయమా? జనాభా లెక్కలు తీస్తే విద్య, ఉద్యోగ రిజర్వేషన్ పెంచాలని, అదే విధంగా స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ బలంగా ముందుకు వస్తుందని భయమా? అందుకే ఆధునిక సామాజిక విప్లవకారులు అయిన మహాత్మ జ్యోతిరావు ఫూలే ఈవిధముగా అంటారు. శ్రామిక కులాలవారు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ సమాజ అభివృద్ధికి సృష్టించిన సర్వసంపదలను కొల్లగొట్టి తాము తిని కూర్చుని భోగ విలాసవంతమైన జీవితాలను అనుభవించుటకు బ్రాహ్మణవాదం సృష్టించిన వర్ణ/కుల విభజిత వ్యవస్థ, వర్ణాశ్రమ వ్యవస్థ అని తన ప్రముఖ రచన గులాంగిరిలో వివరించారు . భారత రాజ్యాంగంలోని 15 (4) (5), 16(4) (5) ప్రకారం బిసి కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. రాజ్యాంగంలోని 243 డి -(6) 243 టి 6 ప్రకారం స్థానిక సంస్థలు బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కానీ జనాభా లెక్క లేకుండా రిజర్వేషన్ శాతం ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగంలోని 339 బి ప్రకారం జాతీయ బిసి కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ బిసిల సమగ్రాభివృద్ధికి ఏ సిఫారసు చేయాలన్నా జనాభా లెక్కలు కావాలి.
రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు రక్షణలు రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు అవసరం. రాజ్యాంగంలో బిసి కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బిసి కులాల లెక్కలు కావాలి. రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు జోక్యం చేసుకుని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని లేదా పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా బిసి రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దేశంలో, ప్రతి రాష్ట్రంలో నియమించిన ప్రత్యేక కమిషన్ జనాభా లెక్క తీయాలని సిఫారసు చేసింది. అనేక రాష్ట్రాలు కులాలవారీగా జనాభా లెక్కలు తీశాయి.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం, ఇతర రిజర్వేషన్ల కోసం, ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బిసి జనాభా లెక్కలు తీశాయి. కానీ వీటికి చట్టబద్ధత లేదని కోర్టులు కొట్టివేశాయి. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత సాంఘిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం బయటకు వస్తుంది. స్వాతంత్య్ర ఫలాలు, ప్రజాస్వామ్య ఫలాలు ఏ ఏ కులాలు ఎంతశాతం పొందాయని వాస్తవాలు బయటకు వస్తాయి. రాజకీయ, నిరుద్యోగ, ఉద్యోగం విద్య, వ్యాపారం, పారిశ్రామిక రంగాలలో ఎంత ప్రాతినిధ్యం ఉంది. ఎవరి ఆధీనంలో పరిశ్రమలు ఆస్తులు దేశ సంపద కేంద్రీకృతమై ఉన్నది తెలుస్తుంది. ఇంతవరకు ఈ రంగాలలో అసలు ప్రాతినిధ్యం లేని కులాలు ఎన్ని? అనేది గుర్తించి వాటిని ఎలా పైకి తేవాలనే పథకాలు రూపొందించడానికి కులాలవారీ జన గణన జరగవలసి ఉన్నది. కుల గణన ఉంటే జనాభా ప్రకారం వీరికి ఎంత శాతం కేటాయించాలని శాస్త్రీయమైన ఆధారాలు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలన సౌకర్యము ఉంటుంది.
ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కోసం, అభివృద్ధి ఫలాలు అందరికీ అందజేయడం కోసం, కులగణన అవసరం. ఈ దేశంలోనీ సామాజిక ఆర్థిక రాజకీయ తదితర అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా అందించవచ్చు. ఈ దేశంలో సామాజిక న్యాయం సాధించబడి అన్ని వర్గాల ప్రజలు ఆకలి అవమానంలేని జీవితం ఆత్మగౌరవంతో జీవిస్తారు. అప్పుడే ఈ దేశం కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసి సాధించిన స్వతంత్ర భారతావని మహానీయుల త్యాగాలకు అర్థం, వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. నిజాలను గుర్తించకుండా కులతత్వం పెరుగుతుందని, కులాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని, సమాజంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని కుంటిసాకులతో, కుట్ర బుద్ధితో, పక్షపాతంగా 90 ఏళ్లుగా ప్రభుత్వాలు కేవలం బిసి కులాలవారి లెక్కలకు మాత్రమే అంగీకరించకపోవడం అన్యాయం.
మల్లెల రామనాథం
9346939481