Thursday, January 9, 2025

దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలు!

- Advertisement -
- Advertisement -

బిసిలకు రాజ్యాధికారం, చట్టసభల్లో బిసి రిజర్వేషన్లు, మా వాటా మాకే, బిసిల కులగణన వంటి పతాక శీర్షికలతో దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా సంస్థలు, విద్యావేత్తలు, ఉన్నత విద్యావంతులు, బిసి సంఘాల నాయకులు, ప్రభుత్వ, ప్రయివేటు రంగ ఉద్యోగులు, కవులు, రచయితలు తదితరులు చేస్తున్న భావప్రకటనలు, సామాన్య ప్రజల మధ్య చర్చలు ఎనిమిది దశాబ్దాలకు చేరువలో వున్న స్వాతంత్య్ర భారతాన్ని నేడు తీవ్రంగా ప్రభావితం చేస్తుందనడం నిర్వివాదాంశం. ప్రపంచానికి భారతదేశం ఓ ఆశాకిరణం అంటూ మన ప్రధాని నరేంద్ర మోడీ, బిసి డిక్లరేషన్ అంశాలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వంటి నాయకులు సైతం నేటి భవిష్యత్ భారతంలో బిసి సమాజం పాత్ర కీలకమని విశ్వసిస్తున్నారు. దాదాపు దేశ జనాభాలో 50% పైగా వున్న బిసిలు కొన్ని దశాబ్దాలుగా కొంతమంది నాయకుల స్వార్థపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలతో విద్య, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడి వున్నారని, ప్రజాస్వామ్య, లౌకిక భారతంలో సమాన అవకాశాలు పొందలేకపోయారని గణాంకాలతో సహా కొంతమంది మేధావులు, ప్రజాప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.
చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు అవసరమని, మా హక్కుల కోసం మా పోరాటం అంటూ బిసిల పోరుబాట ప్రారంభమైంది. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 23% నుంచి 42 శాతానికి పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. ఏదిఏమైనా భారత్ లాంటి దేశంలో ప్రజల జీవితాల్లో మార్పు కేవలం రాజ్యాధికారం ద్వారానే సాధ్యపడుతుందని, కొన్ని దశాబ్దాలుగా రాజ్యాధికారం కొంత మంది చేతుల్లోనే వుందని, ఆ తీరు మారి ప్రజల తీర్పుల్లో మార్పు రావాలనే ఆలోచనలు బలంగా వ్యాపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970లో అనంత రామన్ కమిషన్ నివేదిక, 1982లో మురళీధర రావు ఏకసభ్య కమిషన్, తెలంగాణ ఆవిర్భావం తర్వాత బియస్ రాములు నేతృత్వంలోని తొలి తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ వంటివి ఎన్నో విద్య, ఉద్యోగ రంగాల్లో బిసిలు చాలా వెనుకబడి వున్నారని వివరించాయి. నేడు దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచే బిసిల రాజకీయ చైతన్యం కొత్త మలుపులు తిరుగుతోంది. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో, అసెంబ్లీ, లోక్‌సభల్లో బిసిల గొంతుకలు వినిపించడం లేదు. మనమంతా కలిసి దేశంలో సగం భాగమై వున్నా కూడా ‘మన పాలన’ ఏమైందంటూ కారణాలు వెతుక్కుంటున్నారు బిసిలు. ఇన్నాళ్ళు కేవలం పనివాళ్ళు గానే వుంటూ పాలించే వారిగా ఎదగలేకపోయామని, కనీసం మన పిల్లల భవిష్యత్తులను మార్చుకుందామని అనుకుంటున్నారు. ఒకసారి కొన్ని దశాబ్దాల పరిణామక్రమం గమనిస్తే కొంత మంది బిసి నాయకులే తమ స్వార్థపూరిత రాజకీయ పదవుల కోసం కొంత మంది అగ్రకులాల రాజకీయ నాయకులవద్ద బిసి జెండా వాడుకున్నారని, కులసంఘాలను త్యాగం చేశారని తెలుస్తుంది. బిసి కుల సంఘాల్లో కూడా కొన్ని కులాలకు చెందిన కొంత మంది నాయకుల ఆధిపత్య ధోరణే నేటి బిసిల అనైక్యత, వర్గపోరుకు కారణమని మేధావులు, విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్ స్థాయి అధికారులు వంటివారు సైతం అభిప్రాయపడుతున్నారు. అడుక్కోవడం మానేసి అడగడం నేర్చుకోవాలంటున్నారు. కనీసం ఇప్పటినుంచైనా ఎన్ని జెండాలు మన మధ్య వున్నా ‘బిసిల ఎజెండానే బిసిల రాజ్యాధికారం’ కావాలని తమ సందేశాలను వినిపిస్తున్నారు. బిసిల సంఘటితమే నేడు చారిత్రాత్మక అవసరమని, బిసిల ఐక్యత ఓటు రూపమై బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం కావాలని బిసిల అభ్యున్నతికై పాటుపడే వ్యక్తులను నాయకులుగా మార్చాలని ఆశిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ వేదికల ద్వారా ‘మేము మాత్రమే పాలించగలం’ అంటున్న కొంతమంది అగ్రకులాల నాయకులకు ‘బహుజనులం.. మేమేం తక్కువ కాదని చూపాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఒక దగ్గర ‘ఆకలితో వున్న నలుగురు వ్యక్తులకు పది మందికి సరిపడా భోజనం ఇచ్చి, ఇంకో దగ్గర ఆకలితో వున్న ఇంకో 52 మందికి 25 మందికి సరిపడే భోజనం ఇచ్చి ఆకలి తీర్చుకోమంటే ఎలా? అని ప్రశ్నించే కలాలు, గళాలు కావాలిప్పుడు నేటీ బిసిల జీవితాల్లో మార్పు కోసం..! ఆకలి బాధ అందరికీ ఒక్కటే అయినప్పుడు న్యాయం జరగాలి. ప్రస్తుత తరుణంలో బిసిల కులసంఘాల నాయకులు, వారి రాజకీయపార్టీలకతీతంగా ఏకాభిప్రాయానికి రావాలి. దీనికై బిసిల మేధావుల ఫోరాలు, బిసిల ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు తదితర బిసి ప్రముఖులు ముందుకు రావాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వున్న బిసిపెద్దలు బిసిల అభ్యున్నతికై తోడ్పాటు అందించాలి. బిసి యువత వీరి వెంట వుంటూ చర్చలు, సమావేశాల్లో వీరికి మద్దతివ్వాలి. ‘ఈ ప్రపంచాన్ని మార్చగల ఒకే ఒక ఆయుధం చదువు’ మాత్రమే అన్న నెల్సన్ మండేలా స్ఫూర్తితో బిసి కులాల పిల్లలకు జనాభా ప్రాతిపదికన సమాన విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్చలు జరిపి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టకుండా జాతి సమైక్యత కాపాడుతూ మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో అహింసా మార్గంలో శాంతియుత ఉద్యమాలు నడపుతూ బిసిల హక్కులకై అలుపెరగని పోరాటాలు జరగాలి. అంతర్జాతీయ స్థాయి ప్రతిభను ప్రోత్సహిస్తూనే శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా బిసిలు ఏకమై ఓటు రూపంలో ఒక్కటై ‘మేమెంతో మాకంత’ అంటూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో మన దేశ భవిష్యత్తును మార్చాలి. అందరికీ తెలిసిందే..! వడ్డించే వాడు మనవాడైతే మనం ఎక్కడున్నా ‘అన్నీ’ అందుతాయి. ఇప్పుడు మనకు వడ్డించేవాడు మనవాడై, మన పాలకుడైతే మన ప్రజాస్వామ్య ఫలాలు మనకు అందుతాయి. ప్రస్తుతం ఎస్‌సి, ఎస్‌టి వారి రాజకీయ, సామాజిక చైతన్యం, సంఘటితం వంటి అంశాలను బిసిలు ఆదర్శంగా తీసుకొని జనాభా ప్రాతిపదికన అన్నిరంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కోసం అడుగులు వేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిలో బిసిలంటే కేవలం కొన్ని కులాల సమూహాలు కావు..! బిసిల పోరాటమంటే కొన్ని అగ్రకులాల అవకాశాలకు వ్యతిరేకం కాదు. కనీసం తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలని న్యాయబద్ధంగా కదిలిన కొన్ని కోట్ల మంది తల్లిదండ్రుల అంతరంగపు ప్రయత్నం.

ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News