Monday, November 18, 2024

బిసి రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

బిసి రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు
మంత్రి సీతక్కకు బిసి నేతల వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిసి నేతలు డిమాండ్ చేశారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం మంత్రి సీతక్కను సచివాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామి మేరకు సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, వార్డు మెంబర్ లలో బిసి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని మంత్రిని కోరారు. వచ్చే జూన్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలని నిర్ణయించి అంతకు ముందే ఎన్నికలు జరిపితే బిసిలకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.

కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని, కులగణన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరారు. కులగణన పూర్తి కావడానికి కనీసం 2 నెలలు పడుతుందని, రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తొందరగా ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బహిరంగ సభలలో ప్రతిరోజు కులగణన జరుపుతామని, దాని ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామనిర, బిసిలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తామని, – బిసి ఎజెండా ఎత్తుకొని బిసిల అభిమానం చూర గోంటుంటే ఇక్కడ బిసిలకు అన్యాయం చేయడం తగునా అని కృష్ణయ్య ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు 45శాతం ప్రాతినిధ్యం కల్పించారని, జనరల్ స్థానాల్లో కూడా బిసి జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపిపి – చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఇస్తుంటే ఇక్కడ ఎన్నికల వాగ్దానం ప్రకారం రిజర్వేషన్లు పెంచకుండా అన్యాయం చేయడం తగదని ఆయనన్నారు. 1993లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం బిసి రిజర్వేషన్లు 20 శాతం నుంచి 34 శాతానికి పెంచితే 2019 లో స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని తెలిపారు. దీనితో బిసిలకు అన్యాయం జరిగిందని తెలిపారు.

ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం కులాల వారి లెక్కలు సేకరించి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 22 శాతం నుండి 42 శాతం కు పెంచుతామని, ఆ తర్వాత విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లు 29 శాతం నుంచి జనాభా ప్రకారం 50 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ ప్రకటించారని ఆర్.కృష్ణయ్య గుర్తు చేశారు. . విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న 13 కార్పొరేషన్లకు తోడుగా మరో 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి డిమాండ్ ను అమలు చేస్తామని మంత్రి సీతక్క ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బిసి నేత బృందంలో గుజ్జ కృష్ణ, రాజకుమార్, నిరంజన్, నిఖిల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News