జాతీయ బిసి కమిషన్ నిర్ణయంపై జాజుల పైర్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రాష్ట్ర జాబిత లో ఉండి కేంద్ర జాబితాలో లేని కులాలను ఓబిసి జాబితాలో కలిపితే ఎవ్వరికీ అభ్యంతరం లేదని, కాని ఏలాంటి అర్హత లేని కులాలను కలుపితే సహించేది లేదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన లో కేంద్రాన్ని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా 80 కులాలను కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్లు జాతీయ బిసి కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం హైర్ ఢిల్లీలో ప్రకటించారని, రోజుకొక కూలాన్ని బిసి జాబిత లో కలుపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బిసి రిజర్వేషన్లను మాత్రం ఒక్క శాతం కూడ ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వానికి జాతీయ బిసి కమిషన్ కు చిత్తశుద్ధి ఉంటే రోజుకు ఒక కులాన్ని కలుపుతూ బిసి రిజర్వేషన్లు మాత్రం ఒక్క శాతం కూడా పెంచకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న బిసి కులాలకు, ఓబిసి జాబితాలో చేరబోయే కొత్త కులాలకు కూడా న్యాయం జరగదని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటికే 2650 బిసి కులాలు ఉంటే జనాభాలో 60 శాతం ఉన్న బిసి కులాలకు కేవలం దేశవ్యాప్తంగా 27శాతం, రాష్ట్ర0 లో 29 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇందులో కూడ బిసి క్రిమిలేయర్ విధించి రిజర్వేషన్లకు కోత పెడుతున్నారని ఆయనన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా ఇతర సామాజిక వర్గాలకు, అగ్రవర్ణాలతో సహా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం, బిసిలకు మాత్రం జనాభ దామాష ప్రకారం ఎందుకు కల్పించడం లేదని జాజుల ప్రశ్నించారు. బిసిలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి , కొత్తగా బిసి కులాలను కలిపితే అందరికి న్యాయం జరుగుతుందని ఆయనన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మాదిరిగా బిసిలకు ఎబిసిడి వర్గీకరణ లేకపోవడం మూలంగా దేశంలోని అత్యంత వెనుకబడిన వారికి, సంచార జాతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో బిసి జాబితాలో ఉన్న కులాల కంటే అగ్రవర్ణాలలో ఉన్న కులాలకే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయని, బిసిలకు మాత్రం సమాన అవకాశాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ,ఎపి,, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండి 80 కులాలను కలుపుతామని జాతీయ బిసి కమిషన్ నిర్ణయం తీసుకోవడం వల్ల బిసి రిజర్వేషన్లు మూరెడు, బిసి జాబితా బారెడుగా మార్చారని,దీనివల్ల ఏ కులానికి,ఎవరికి ప్రయోజనం ఉండదని అన్నారు. పళ్లెంలో పాలు పోసి కొంగలను తాగమనట్టుగా ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు బిసి రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచకపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ రాజకీయంగా కర్ణాటక తరహలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని జాజుల హెచ్చరించారు.