మనతెలంగాణ/ హైదరాబాద్ : బలహీన వర్గాలకు చెందిన 93 కులాలకు బిసి బంధు పథకం అమలు చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే రఘునందన్ రావు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిసి బంధు పథకం చాట్ల తవుడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్లు ఉందని ధ్వజమెత్తారు. బిజెపిలో ఉంటే బిసి బంధు ఇవ్వం అని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏజెంట్లను పెట్టుకొని అధికార పార్టీకి వత్తాసు పలికే వాళ్లకు బిసి పథకం అందిస్తున్నారని విమర్శించారు.
బిసి పథకం కోసం సిద్దిపేట జిల్లాలో 26 వేల దరఖాస్తులు వచ్చాయని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నచోట కనీసం బిసి పథకం లబ్దిదారుల జాబితా కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పట్టుమని పది మంది కూడా లేరని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కొన్నిచోట్ల ఒక్కో ఇంట్లో ఇద్దరికీ బిసి పథకం అందిస్తున్నారని, 93 కులాలకు బిసి పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.