Sunday, January 19, 2025

బిసిలకు బిఆర్‌ఎస్ ఒక్కటే రక్ష

- Advertisement -
- Advertisement -

ఇంత కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు బడుగు, బలహీన బిసి వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారి ప్రగతి కోసం పాటుపడలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ బిసిలకు సరిపడా టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసింది. సీనియర్ నాయకులెందరో కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వెళ్లిపోవడమే దీనికి నిదర్శనం. ఇక బిజెపి అయితే టికెట్ల విషయంలో బిసిలకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. పైగా ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బిసి నాయకుడిని మార్చి అగ్రవర్ణ నాయకుడికి కట్టబెట్టింది. ఆ ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నది.
అగ్రవర్ణాల పార్టీగా పేరొందిన బిజెపి బిసి వర్గాల్లో తమకు నష్టం జరుగుతుందన్న భయంతోనే చివరాఖరుకు బిసి ముఖ్యమంత్రి నినాదం అందుకున్నది. ఇదే సమయంలో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ బిసిలకు అత్యధికంగా సీట్లిచ్చి అవకాశాలు కల్పించిందనడంలో సందేహం లేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో బిసిల కుల వృత్తులకు ప్రోత్సాహం కల్పించి, పరిరక్షిస్తుండటంతో అత్యధికంగా బిసి వర్గాలకే లాభం జరుగుతున్నది. అదే సమయంలో కేంద్రంలోని బిజెపి గానీ, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ గానీ బిసిల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. బిసిలకు సంక్షేమ మంత్రిత్వశాఖ వున్నట్టయితే బిసిల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, పరిష్కారానికి ఒక అధికారిక వేదిక ఉంటుందని బిఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచీ భావిస్తున్నది. అందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రంలో బిసి సంక్షేమ మంత్రిత్వశాఖ అవసరాన్ని కేంద్రానికి పలుమార్లు గుర్తు చేస్తూ డిమాండ్ చేశారు.

తెలంగాణ ఏర్పడిన వెంటనే తొలి శాసన సభా సమావేశాల్లోనే 2014 జూన్ 14నాడు బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ కేంద్రం ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనేది శుష్క నినాదమేననీ, బిజెపి ప్రభుత్వ ఎజెండాలో బిసి కులాల వికాసం లేనేలేదని స్పష్టంగా తేలిపోయింది. బిజెపి అనుసరిస్తున్న బిసి వ్యతిరేక వైఖరిని దేశంలోని అన్ని వర్గాలూ నిరసిస్తున్నాయి. బిసిల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు మాత్రం లభించడం లేదు. దీనికి గల ప్రధాన కారణం దేశంలో బిసి కులాలకు సంబంధించిన ఖచ్చితమైన, గణాంకాలు లేకపోవడమే.
దేశంలో మెజారిటీ సంఖ్యలోవున్న బిసిల కులగణన చేయకుండా, బిసి వర్గాల అభివృద్ధిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. కేంద్ర విధానాలతో విద్య, ఉద్యోగ రంగాల్లో బిసిలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే తగిన వివరాలు లేకుండా ఏ వర్గాన్నయినా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ తెలంగాణ సిఎం కెసిఆర్ చెప్పిన మాట ఆలోచింపదగినది. కచ్చితమైన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికా రచన, విధాన నిర్ణయాలు జరగాలనేది ప్రాథమిక అవగాహన. అందుకే తెలంగాణ ఏర్పడిన వెంటనే సిఎం కెసిఆర్ సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా జరిపి, రాష్ట్రంలోని ప్రజల మొత్తం వివరాలను ఒకే ఒక్క రోజులో సేకరించడం గమనార్హం.

అభివృద్ధి ఫలాల పంపిణీలో జరిగే అవకతవకలన్నింటికీ నిర్దిష్టమైన గణాంకాలు లేకపోవడమే ప్రధాన కారణం అని ముఖ్యమంత్రి కెసిఆర్ పదే పదే అంటుంటారు. సామాజిక గణాంకాల ఆవశ్యకత, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రాధాన్యత తెలిసిన నాయకుడు కావటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ‘సమగ్ర కుటుంబ సర్వే’ ను ఒకే ఒక్క రోజులో సమర్థవంతంగా నిర్వహించారు.నేడు దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నిర్దిష్టమైన, సమగ్రమైన, స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికలు రూపకల్పన చేస్తుండటం వల్లనే తెలంగాణ ప్రభుత్వం అట్టడుగు స్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సక్రమంగా అందించగలుగుతున్నది. తాజాగా రూపొందించిన ఖచ్చితమైన గణాంకాలతో మాత్రమే అభివృద్ధి, సంక్షేమంలో బిసి వర్గాలకు న్యాయమైన వాటా లభిస్తుంది. కానీ ఈ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయడంలో దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ విఫలమయ్యాయి. ఈ నిర్లక్ష్యం వల్ల 75 సంవత్సరాల కాలంలో దేశంలోని బిసి వర్గాలకు దక్కాల్సిన లక్షల కోట్ల లబ్ధి చేకూరలేదు. సామాజిక న్యాయం లభించలేదు బిసి వర్గాల జీవితాల్లో రావాల్సిన వెలుగు రాకుండా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపిలు అడ్డుకున్నాయి.అందుకే రాబోయే కాలంలో జరపబోయే జనాభా గణనలో కులాల వారీగా బిసి వర్గాల జనాభా లెక్కలు సేకరించాలని కేంద్రాన్ని బిఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు 2021 అక్టోబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపింది. అయినప్పటికీ ఈ అంశంపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణిని అవలంబిస్తూ బిసిలకు తీరని అన్యాయం చేస్తున్నది.

బిసిల వివరాల సేకరణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం తన అసక్తతను వ్యక్తం చేసింది. 2011 నాటి జనగణన సందర్భంగా సేకరించిన బిసిల వివరాలు తప్పుల తడకగా వున్నాయనీ, ఈ నేపథ్యంలో ఇకముందు ఈ వివరాల్ని సేకరించలేమని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపింది. బ్రిటిష్ హయాంలో మన దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఇప్పటికీ అవే లెక్కలపై ఉజ్జాయింపుగా ఆధారపడతామనడం ఆశ్చర్యకరం. స్వయంగా బిసి అయికూడా బిసి గణన గురించి ఏనాడూ మాట్లాడని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు 2018లో బిసిల కులగణన చేపడుతామని, రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని మర్చిపోయారు. బిజెపి రాష్ట్ర నాయకులు కూడా ఏనాడూ బిసిల కులగణన గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. బిజెపి, కాంగ్రెస్ నేతల తీరు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా బిసి కుల గణన చేపట్టాలని చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి రిజర్వేషన్ల పెంచాలని జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం చేస్తామని ప్రకటించడం బిసిల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి, బిసి వర్గాల జన గణనను చేపట్టాల్సిన, కేంద్రంలో బిసిలకు ప్రత్యేకంగా సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన తక్షణ అవసరం వున్నది. ఈ విషయాలపై బిజెపి, కాంగ్రెస్ పార్టీలు స్పష్టమైన వైఖరిని ప్రజల ముందు ఉంచాల్సి వుంది. తెలంగాణలో బిసిలకు అత్యధిక సీట్లిచ్చి అవకాశాలు కల్పించిన బిఆర్‌ఎస్ అభ్యర్థుల్ని గెలిపించుకుంటేనే శ్రీరామరక్ష అనే అంశాలను ప్రతి బిసి బిడ్డ గుర్తుంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News