ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష
మనతెలంగాణ/ హైదరాబాద్ : బిసి సంక్షేమ, అభివృద్ధి, నిర్వహణ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించామని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం ఖైరతాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో 2022..-23 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్లో బిసి సంక్షేమ శాఖకు అవసరమైన నిధుల కేటాయింపునకు ప్రతిపాదనలపై సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఇప్పటికే శాఖాపరంగా అవసరమైన నిధులపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఎంబిసి, బిసి కార్పొరేషన్‌లు,ఫెడరేషన్‌లు, కళ్యాణలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆత్మగౌరవ భవనాలు, తదితర అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక శాఖకు సమర్పించాల్సిన బడ్జెట్‌పై కసరత్తు చేశామన్నారు. నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. సమావేశంలో బిసి కార్పోరేషన్ ఎండి, మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాల కార్యదర్శి మల్లయ్యబట్టు, బిసి స్టడీసర్కిల్ ఎండి అలోక్‌కుమార్, వడ్డెర ఫెడరేషన్ ఎండి బాలాచారి, రజక ఫెడరేషన్ ఎండి చంద్రశేఖర్, నాయీబ్రాహ్మణ పెఢరేషన్ ఎండి విమలాదేవి, బిసి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.