Sunday, February 2, 2025

హనుమకొండలో గర్జించిన బిసిలు

- Advertisement -
- Advertisement -

బిసిల జనాభా 60 శాతానికి పైగా ఉన్నా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వివక్ష నేటికీ కొనసాగుతోందని పలువురు జాతీయ, రాష్ట్ర ఉద్యమ నాయకులు ధ్వజమెత్తారు. హనుమకొండ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన బిసి రాజకీయ యుద్ధభేరి సభ దద్దరిల్లింది. వందకు పైగా గల బిసి కులాలు ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో తమ వాటా కోసం గర్జించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరు కాగా విశిష్ట అతిథిగా రాజ్యసభ సభ్యుడు, బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తమిళనాడుకు చెందిన రాజ్యసభ సభ్యుడు విల్సన్, బిసి మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంఎల్‌ఎసి బస్వరాజు సారయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి,

బిసి ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ టి. చిరంజీవులు, మాజీ ఎంఎల్‌ఎసి పూల రవీందర్, జమాతే ఇస్లామి రాష్ట్ర అధ్యక్షుడు ఎంకేఎం జాఫర్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాగౌడ్ తదితరులు హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో గడిచిన 77 సంవత్సరాలుగా బిసిలకు తీరని అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు. గొర్రెలు, బర్రెలు, ఇండ్లు, స్థలాల కోసం అగ్రవర్ణాల నాయకులను అడుక్కుంటూ బిసిలు బిచ్చగాళ్లలా బతుకుతున్నారని అన్నారు. బిసిలకు అన్యాయం జరుగుతున్నదని తెలిసినా ఆయా రాజకీయ పార్టీలలోని బిసి నాయకులు స్పందించడం లేదని, ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కార్పొరేట్ వర్గాల కోసం పనిచేస్తున్నదని, బిసిల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ఇప్పటికైనా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం కొట్లాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ బిల్లును రద్దు చేయాలని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సభకు జిల్లా బిసి జెఎసి ఛైర్మన్, టీచర్స్ ఎంఎల్‌ఎసి అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్ అధ్యక్షత వహించగా వివిధ సంఘాల నాయకులు ఈగ మల్లేషం, సురేష్ యాదవ్, ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్, బొనగాని యాదగిరి గౌడ్, చాపర్తి కుమారస్వామి, తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ, ఎం. కుమార్ యాదవ్, వేణుగోపాల్ గౌడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News