Monday, January 20, 2025

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా రాహుల్

- Advertisement -
- Advertisement -

అశ్విన్‌కు చోటు.. కెప్టెన్‌గా రాహుల్
కోహ్లి, రోహిత్, హార్దిక్‌లకు విశ్రాంతి
ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు టీమిండియా ఎంపిక
ముంబై: సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో తొలి రెండు వన్డేల కోసం టీమిండియాను ఎంపిక చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిలకు విశ్రాంతి కల్పించారు. అంతేగాక ఆసియాకప్‌లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్‌కు కూడా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉంచారు. తొలి రెండు మ్యాచ్‌లకు కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి వన్డే జట్టులో చోటు కల్పించారు. అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు.

ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు మరోసారి ఛాన్స్ దొరికింది. ఆసియాకప్‌లో విఫలమైన తిలక్‌తో పాటు సూర్యకుమార్‌కు కూడా అవకాశం ఇచ్చారు. ఇదిలావుంటే ఆస్ట్రేలియాతో జరిగే మూడో, చివరి వన్డేకు మాత్రం రోహిత్, కోహ్లి, హార్దిక్, కుల్దీప్‌లు తిరిగి జట్టులోకి వస్తారు. అయితే అక్షర్ పటేల్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడంలో విఫలమైతే మాత్రం అశ్విన్‌ను కొనసాగిస్తారు. ఇక ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. రెండో వన్డే 24న ఇండోర్‌లో మూడో, చివరి వన్డే 27న రాజ్‌కోట్‌లో జరుగుతుంది. సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా-భారత్ జట్లు వరల్డ్‌కప్ బరిలోకి దిగుతాయి. కాగా, ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేల్లో రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తదితరులు చోటు దక్కించుకున్నారు.

తొలి రెండు వన్డేలకు భారత జట్టు:
కెఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌వర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్, వాషింగ్టన్, అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, షమీ, బుమ్రా.
మూడో వన్డేకు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జడేజా, శార్దూల్, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, అశ్విన్, బుమ్రా, షమి, సిరాజ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News