ముంబై: కరోనా మహమ్మరి నేపథ్యంలో క్రికెటర్ల వేతనాల్లో కోత విధిస్తారనే వార్తలకు తెరపడింది. 2020-21 సీజన్‌కు సంబంధించి క్రికెటర్లకు పాత వేతనాలే ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బిసిసిఐ ఒక ప్రకటనను విడుదల చేసింది. గతంలో ఇచ్చిన విధంగానే ఈసారి కూడా గ్రేడ్‌ల విధానంలో క్రికెటర్లకు వేతనాలు చెల్లిస్తామని బోర్డు వివరించింది. ఎ ప్లస్ విభాగంలో ఈసారి ముగ్గురికి చోటు లభించింది. ఈ కేటగిరీలో కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాలు ఉన్నారు. వీరికి ఏడు కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఇక ఎ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఐదు కోట్ల రూపాయల వేతనాన్ని అందిస్తారు. ఈ కేటగిరీలో అశ్విన్, జడేజా, పుజారా, రహానె, ధావన్, రాహుల్, షమి, ఇషాంత్, రిషబ్, హార్దిక్ పాండ్యలు ఉన్నారు. మరోవైపు కేటగిరి బిలో ఉన్న ఆటగాళ్లకు మూడు కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఈ జాబితాలో వృద్ధిమాన్ సాహా, ఉమేశ్, భువనేశ్వర్, శార్దూల్, మయాంక్ అగర్వాలకు చోటు కల్పించారు. ఇక సి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఏడాదికి రూ కోటి చొప్పున అందజేస్తారు. ఈ కేటగిరీలో కుల్దీప్, సైని, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, అక్షర్, శ్రేయస్, సుందర్, సిరాజ్, చాహల్‌లు ఉన్నారు.
BCCI Announces annual player contracts