ముంబై : ఐపిఎల్ 17వ సీజన్ అన్‌సంగ్ హీరోలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) భారీ నజరానా ప్రకటించింది. ఈ సీజన్‌లో 13 వేదికల్లో పిచ్‌లను సిద్దం చేసిన క్యూరెటర్లతో పాటు మైదానాల సిబ్బందికి బిసిసిఐ నగదు నజరానా అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బిసిసిఐ సెక్రటరీ జైషా సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. 10 ఫ్రాంచైజీలకు చెందిన హోమ్ గ్రౌండ్స్‌లోని క్యూరెటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ఒక్కో మైదానం చొప్పున రూ. 25 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు బిసిసిఐ పేర్కొంది.
అలాగే అదనపు వేదికల్లోని ధర్మశాల, వైజాగ్, గువాహటి గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు ఒక్కో మైదానం చొప్పున రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ మెగా లీగ్ విజయవంతంగా మగియడంలో వీరు కీలక పాత్ర పోషించారని, దాంతోనే క్యాష్ రివార్డ్స్ అందజేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.