ముంబై: మహిళా క్రికెటర్లకు సంబంధించి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళా క్రికెటర్లకు కూడా పురుష ఆటగాళ్లతో సమానంగా వేతనాలను అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జైషా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరు తెచ్చుకున్న బిసిసిఐకి మహిళా క్రికెటర్లపై చిన్నచూపు చూస్తుందనే విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా ఇలాంటి విమర్శలను చెరిపేసుకునేందుకు బిసిసిఐ ప్రయత్నాలు ప్రారభించింది. ఇందులో భాగంగా పురుషుల ఐపిఎల్‌కు దీటుగా మహిళలకు ఇలాంటి టోర్నీని నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపిఎల్‌ను బిసిసిఐ నిర్వహించనుంది. తాజాగా మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇకపై టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.ఆరు లక్షలు, టి2లకు రూ.3 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇక బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
BCCI announces equal pay for Men and Women Cricketers