Monday, December 23, 2024

టి20 ప్రపంచకప్ కు టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

ముంబై: యుఎఇ వేదికగా జరిగే మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన టీమ్‌ను భారత క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యుఎఇలో ఈ వరల్డ్‌కప్ జరుగనుంది. ఇందులో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు చోటు కల్పించారు. గ్రూప్‌బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు స్థానం దక్కించుకున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇక రెండో మ్యాచ్‌లో అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఎదుర్కొంటోంది. 9న శ్రీలంకతో, 16న ఆస్ట్రేలియాలతో భారత్ పోటీ పడుతుఓంది. ప్రతి గ్రూప్ నుంచి లీగ్ దశలో అగ్రస్థానంలో రెండు జట్లు సెమీస్‌కు చేరుతాయి. సెమీ ఫైనల్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్‌డే ఉంటుంది.

ఫైనల్ అక్టోబర్ 20న జరుగుతుంది. ఇక వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో అనుభవజ్ఞులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఊహించినట్టే కీలక ఆటగాళ్లందరూ జట్టులో చోటు సంపాదించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, మంధాన ఈసారి కూడా జట్టు బాధ్యతలను మోయనున్నారు. షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, పుజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, యాస్తికా భాటియా, హేమలత తదితరులు వరల్డ్‌కప్ జట్టులో స్థానం సొంతం చేసుకున్నారు. శ్రేయంకా పాటిల్‌ను ఎంపిక చేసినా ఫిట్‌నెస్ సాధించకపోతే ఇతరులకు ఛాన్స్ ఇస్తారు. రాధా యాదవ్, సంజనా, ఆశా శోభనలు కూడా జట్టులో స్థానం దక్కించుకున్నారు.

ఈసారైనా ట్రోఫీ దక్కెనా?
ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో టీమిండియా ప్రతిసారి ఫేవరెట్‌గా దిగడం అనవాయితీగా వస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత జట్టు ఈసారి కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవ లేదు. హర్మన్‌ప్రీత్, షఫాలీ, మంధాన, రోడ్రిగ్స్, పుజా వస్త్రాకర్, దీప్తి శర్మ, యాస్తికా భాటియా, రిచా వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు.

ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా వీరి సొంతం. రాధా యాదవ్, రేణుకా సింగ్, దీప్తి, వస్త్రాకర్ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉంది. చాలా కాలంగా భారత జట్టు వరల్డ్‌కప్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. ఈసారైనా టీమిండియా ప్రయత్నం ఫలిస్తుందా లేదా వేచిచూడాల్సిందే.

జట్టు వివరాలు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, శ్రేయంకా పాటిల్(ఫిట్‌నెస్ సాధిస్తే), యాస్తికా భాటియా, పుజా వస్త్రాకర్, రేణుకా సింగ్, సంజనా సంజీవన్, రాధా యాదవ్, ఆశా శోభన, హేమలత, అరుంధతి రెడ్డి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News