Friday, November 22, 2024

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎంపికయ్యాడు. గంభీర్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. గంభీర్ ఎంపిక విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో గంభీర్ ఎన్నో పాత్రలను పోషించాడు. ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యహరించి ట్రోఫీలను అందించాడు.

అంతేగాక ఈ సీజన్‌లో మెంటార్ బాధ్యతలు నిర్వర్తించి జట్టు ఐపిఎల్ ట్రోఫీ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. గంభీర్ ఎంపికతో కొంతకాలంగా ప్రధాన కోచ్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇప్పటి వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ పదవి కాలం వరల్డ్‌కప్‌తో ముగిసింది. ఈ క్రమంలో కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) దరఖాస్తులను ఆహ్వానించింది. కోచ్ పదవి కోసం భారత్‌తో పాటు విదేశీ క్రికెటర్లు సయితం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రత్యేక ఇంటర్వూలు నిర్వహించిన బిసిసిఐ అధికారులు చివరికి గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపి చేశారు. త్వరలో ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్‌తో గంభీర్ తన బాధ్యతలను చేపడుతాడు.

కాగా, సహాయక కోచ్‌ల ఎంపిక విషయంలో బిసిసిఐ గంభీర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిసింది. తాను కోరుకున్న వారిని సహాయకులుగా ఎంపిక చేయాలని గంభీర్ చేసిన విజ్ఞప్తికి బిసిసిఐ పెద్దలు సానుకూలంగా స్పందించారు. అంతేగాక జీతభత్యాల విషయంలో కూడా పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే గంభీర్ కోచ్ పదవి నిర్వహించేందుకు ఒప్పుకున్నట్టు తెలిసింది. కాగా, ఓపెనర్‌గా టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా గంభీర్ భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. రెండు వరల్డ్‌కప్‌లు గెలిచిన జట్టులోనూ గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. అతని సారథ్యంలో కోల్‌కతా రెండు సార్లు ఐపిఎల్ ట్రోఫీలను గెలుచుకుంది.

తాజాగా అతని పర్యవేక్షణలో మరోసారి కోల్‌కతా ఐపిఎల్ విజేతగా నిలిచింది. అపార అనుభవజ్ఞుడైన గంభీర్ ప్రధాన కోచ్‌గా రావడాన్ని క్రికెటర్లు స్వాగతించారు. అతని పర్యవేక్షణలో భారత జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందనే నమ్మకాన్ని సెహ్వాగ్, కుంబ్లే, కపిల్‌దేవ్, గంగూలీ, మంజ్రేకర్ తదితరులు వ్యక్తం చేశారు. బిసిసిఐ కార్యదర్శి జైషా కూడా గంభీర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గంభీర్‌కు అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్త పరిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News