Tuesday, November 5, 2024

బిసిసిఐపై ఆగని విమర్శలు

- Advertisement -
- Advertisement -

BCCI

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఐపిఎల్ టి20 టోర్నమెంట్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సమయంలో బిసిసిఐ పైసలకు కక్కుర్తిపడి ఐపిఎల్ నిర్వహణకే మొగ్గు చూపడాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు తమవంతు సహాయం అందించాల్సిన ఐపిఎల్ జట్ల యజమానులు కోట్లాది రూపాయలను వెచ్చించి ఐపిఎల్ నిర్వహించడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా విలియ తాండవం చేస్తోంది. ఆక్సిజన్‌లు లేక, సరైన వైద్యం అందుబాటులో లేక వేలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక శవాలను ఖననం చేసేందుకు స్థలం కూడా లభించని దుర్భర పరిస్థితి దేశంలో నెలకొంది. ఇలాంటి విషాద సమయంలో బిసిసిఐ మాత్రం కాసుల వర్షం కురిపించే ఐపిఎల్ టోర్నీపై దృష్టి పెట్టడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

బిసిసిఐ తీరును ఇప్పటికే చాలా మంది తప్పుపడుతున్నారు. రాజకీయ, వాణిజ్య ప్రముఖులు సయితం ఐపిఎల్ కొనసాగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసాధారణ పరిస్థితులు నెలకొని దేశం కొట్టుమిట్టాడుతున్న తరుణంలో బిసిసిఐ పెద్దలకు ఈ విషయం అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందని వారు విమర్శిస్తున్నారు. ఇక భారత్‌లో పరిస్థితి చేయి దాటి పోవడంతో ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన క్రికెట్ బోర్డు తమ తమ క్రికెటర్లను స్వదేశాలాకు వచ్చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే పలువురు అంపైర్లు కరోనా బారిన పడ్డారు. అంతేగాక సహాయక సిబ్బంది కూడా కూడా ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకున్నారు. పలువురు క్రికెటర్లు కూడా కరోనాతో సతమతమవుతున్నారు. అయినా కూడా వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌కు పరిమితం చేస్తూ బిసిసిఐ ఐపిఎల్‌ను కొనసాగించడంపై విమర్శలు ఆగడం లేదు. కాగా, ఐపిఎల్‌ను ఆపితే తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని దాన్ని కోల్పోవడం ఇష్టం లేదని కొందరూ బిసిసిఐ పెద్దలు బాహటంగానే పేర్కొంటుండడం విశేషం. దీన్ని బట్టి బిసిసిఐకి దేశ ప్రజల కంటే డబ్బులే ముఖ్యమన్న విషయం ఇట్టే అర్థమవుతోంది. ఇలాంటి స్థితిలో ఐపిఎల్‌ను బిసిసిఐ నిలిపి వేస్తుందని ఆశించడం అత్యాశే అవుతోంది.

BCCI faces Criticism over IPL 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News