Monday, January 20, 2025

సీనియర్లకు విశ్రాంతిపై విమర్శల వర్షం

- Advertisement -
- Advertisement -

సీనియర్లకు విశ్రాంతిపై విమర్శల వర్షం
బిసిసిఐ తీరుపై అభిమానుల ఆగ్రహం
ప్రపంచకప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న సమయంలో సెలెక్టర్లు కొంత మంది సీనియర్లను విశ్రాంతి పేరిట జాతీయ జట్టుకు దూరంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో వరల్డ్‌కప్‌నకు ముందు జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియాను బిసిసిఐ ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ తదితరులను దూరంగా ఉంచడం విస్మయం కలిగించే అంశమే. మెగా టోర్నీకి ముందు భారత్ ఆడే ఏకైక సిరీస్ ఇదే కావడం విశేషం.

అయితే సెలెక్టర్లు మాత్రం వరల్డ్‌కప్ జట్టుతో బరిలోకి దిగకుండా ప్రయోగాల పేరుతో కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడం పెద్ద దుమారంగా మారింది. సెలెక్టర్ల తీరుపై పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లో రోహిత్ కోహ్లి, హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లి తదితరులకు తగినంత ప్రాక్టీస్ లభించనే లేదు. ఇలాంటి స్థితిలో వీరిని ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరంగా ఉంచడం ఏంటనీ వారు ప్రశ్నిస్తున్నారు. భారత్‌తో జరిగే సిరీస్ కోసం ఆస్ట్రేలియా సీనియర్లందరినీ ఎంపిక చేయగా బిసిసిఐ మాత్రం విశ్రాంతి పేరుతో కీలక ఆటగాళ్లను దూరంగా ఉంచడాన్ని వారు తప్పుపడుతున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లోటీమిండియాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో బిసిసిఐ ప్రయోగాలకు పోవడంపై విమర్శల వర్షం కురుస్తోంది.

విరాట్ కోహ్లి, రోహిత్, హార్దిక్‌లు రానున్న వరల్డ్‌కప్‌లో టీమిండియాకు చాలా కీలకం అనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి కీలక ఆటగాళ్లను జట్టుకు దూరంగా ఉంచడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, అజారుద్దీన్, గంగూలీతో పాటు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా తదితరులు బిసిసిఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలతో జట్టుకు ఒరిగేదేమీ ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా సెలెక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని రోజుల్లోనే మెగా టోర్నీ ప్రారంభం అవుతుండగా ఇలాంటి ప్రయోగాలు ఏమాత్రం సమంజసం కాదని వారు పేర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బిసిసిఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News