Wednesday, January 22, 2025

పంత్‌కు గ్రీన్ సిగ్నల్.. ప్రసిద్ధ్, షమీలు ఔట్

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు భారీ ఊరట లభించింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు 14 నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న రిషబ్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపిఎల్ ఆడేందుకు పంత్‌కు బిసిసిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఐపిఎల్‌లో రిషబ్ ఆడేందుకు మార్గం సుగమం అయ్యింది. జాతీయ క్రికెట్ అకాడమీలో బిసిసిఐ వైద్యులు పర్యవేక్షణలో కోలుకుంటున్న రిషబ్ పంత్‌కు ఐపిఎల్‌లో ఆడేందుకు బిసిసిఐ అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం రిషబ్ పంత్ ఫూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, ఐపిఎల్ ఆడేందుకు అతనికి ఎలాంటి ఇబ్బందులు లేవని బిసిసిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2024 సీజన్‌లో రిషబ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలోనే అతను ఢిల్లీ శిబిరంలో చేరనున్నాడు. రిషబ్ చేరికతో ఢిల్లీ మరింత బలోపేతంగా మారనుంది. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా రిషబ్ ఢిల్లీ జట్టుపై తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. కాగా, కిందటి సీజన్‌లో పంత్ ఐపిఎల్‌కు దూరంగా ఉన్నాడు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ చాలా రోజుల పాటు ఆటకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే కఠోర శ్రమ, వైద్యుల కృషితో అతను పూర్తిగా కోలుకున్నాడు. త్వరలోనే మళ్లీ క్రికెట్ మైదానంలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలావుంటే భారత ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణలు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంలో విఫలం కావడంతో వారికి ఐపిఎల్‌లో ఆడేందుకు బిసిసిఐ అనుమతి నిరాకరించింది. వీరిద్దరూ 2024 ఐపిఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా వెల్లడించింది. ఎడమ కాలి మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు మరికొంత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఇక, కుడికాలి చీలమండకు ఆపరేషన్ చేయించుకున్న షమీ కూడా పూర్తిగా కోలుకోలేదు. దీంతో వీరిద్దరికి ఐపిఎల్‌లో ఆడేందుకు బిసిసిఐ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇద్దరు ఐపిఎల్‌కు దూరం కాక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News