కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని అతనికి వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఛాతినొప్పితో బాధపడుతున్న గంగూలీని కుటుంబ సభ్యులు బుధవారం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల క్రితమే గంగూలీ గుండెనొప్పితో హాస్పిటల్ చేరిన విషయం తెలిసిందే. అప్పట్లో పూర్తిగా కోలుకోవడంతో ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ చేశాడు. ఇక తాజాగా గంగూలీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. డీంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
ఇదిలావుండగా గురువారం గంగూలీకి యాంజియోప్లాస్టి చికిత్స చేశారు. ఈ సందర్భంగా అతనికి మరో రెండు స్టెంట్‌లను అమర్చినట్టు వైద్యులు వివరించారు. గంగూలీ ఆరోగ్యం స్వల్ప మార్పులు కనబడడంతో యాంజియోప్లాస్టి చికిత్స చేయాల్సి వచ్చిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం గంగూలీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇదిలావుండగా గంగూలీని మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అతని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అతను త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు. మరోవైపు గంగూలీ సహచర క్రికెటర్లు కూడా అతనికి పూర్తి ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు.