Saturday, April 5, 2025

విశాఖలో వన్డే సమరం

- Advertisement -
- Advertisement -

విండీస్, సౌతాఫ్రికాలతో సిరీస్ ఖరారు
షెడ్యూల్ విడుదల చేసిన బిసిసిఐ
ముంబై: ఈ ఏడాది సొంత గడ్డపై టీమిండియా ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. స్వదేశంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో భారత్ సిరీస్‌లు ఆడనుంది. విండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడుతుంది. తొలి టెస్టు అక్టోబర్ రెండు నుంచి ఆరు వరకు అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. రెండో టెస్టుకు కోల్‌కతా ఆతిథ్యం ఇస్తోంది. ఈ టెస్టు అక్టోబర్ 10 నుంచి 14 వరకు ఈడెన్ గార్డెన్ వేదికగా నిర్వహిస్తారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తోంది.

ఈ క్రమంలో సౌతాఫ్రికా రెండు టెస్టులు, మరో మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచుల్లో భారత్‌ను ఎదుర్కొంటోంది. తొలి టెస్టు నవంబర్ 14 నుంచి ఢిల్లీలో జరుగుతుంది. రెండో టెస్టు మ్యాచ్‌కు గౌహతి ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్ నవంబర్ 22 నుంచి 26 వరకు జరగనుంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి వన్డే నవంబర్ 30న రాంచీలో జరుగుతుంది. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా నిర్వహిస్తారు. మూడో వన్డేకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం వేదికగా నిలువనుంది. డిసెంబర్ ఆరున ఈ పోరు జరుగుతుంది.

ఇక సౌతాఫ్రికాతో తొలి టి20 మ్యాచ్ డిసెంబర్ 9న కటక్‌లో జరుగనుంది. రెండో టి20 డిసెంబర్ 11న చండీగఢ్‌లో, మూడో టి20 డిసెంబర్ 14న ధర్మశాలలో, నాలుగో టి20 డిసెంబర్ 17న లక్నోలో జరుగుతుంది. ఇక చివరి, ఐదో టి20 మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండి. డిసెంబర్ 19న ఈ పోరు జరుగనుంది. ఇక ఐపిఎల్ ముగిసిన వెంటనే టీమిండియా వరుస సిరీస్‌లు ఆడనుంది. ఇంగ్లండ్‌లో పర్యటించే భారత జట్టు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News