బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలకు కావాల్సింది లేఖలు కాదు…బి ఫాంలు అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చట్టసభల్లో బిసిలకు, మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో నిర్ణయించడం, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి లేఖ రాయడం బిసిలను ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడ అని ఆయనన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ అని విమర్శించారు.
దోమలగూడ లోని బిసి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిసి సంఘాల నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బిఆర్‌ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన 115 మంది జాబితాలో 60 శాతం ఉన్న బిసిలకు 20 శాతం మాత్రమే టికెట్ లు కేటాయించి, అర శాతం ఉన్నవాళ్ళకు 12 టికెట్లు, ఐదు శాతం ఉన్న వాళ్లకు 40 టికెట్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. బిసిలలో 130 కులాలకు అసలు టికెట్లు కేటాయించలేదని, కోటి మంది జనాభా ఉన్న బిసి మహిళలకు ఒక్క స్థానం కేటాయించలేదని పేర్కొన్నారు. ఇకనైనా బిఆర్‌ఎస్ పార్టీ బిసి వ్యతిరేక వైఖరి మార్చుకొని జనాభా దమాశా ప్రకారం రాజకీయ ప్రాతిధ్యం కల్పించాలని అప్పుడే బిసిలు నమ్ముతారని అన్నారు. ఈ సమావేశంలో బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారపు గణేష్ చారి,బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాదేశ్ రాజేందర్ రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్ కుమార్, నాగరాజు గౌడ్, సిద్ధాంతం శ్యామల, బండి గారి రాజు, మనోజ్ చారి గుంటి మహేష్, వరలక్ష్మి, పద్మావతి, రవి తదితరులు పాల్గొన్నారు.