ప్రమోషన్లలో రిజర్వేషన్లు… క్రిమిలేయర్ తొలగింపు డిమాండ్
హైదరాబాద్ : తమ ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర బిసి ఉద్యగ సంఘం నిర్ణయించింది. ప్రమోషన్లలో రిజర్వేషన్లు క ల్పించాలని, బిసి రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలయేర్ తొలగించాలనే ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని చాలా కాలంగా బిసి ఉద్యోగులు పోరాడుతున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం బిసి భవన్‌లో బిసి ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసిల ఉద్యమానికి బిసి ఉద్యోగులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
దేశ జనాభాలో 56 శాతం ఉన్న బిసిలు కులాల పేరుతో విడిపోవడం వల్ల న్యాయమైన డిమాండ్లను సాధించలేకపోతున్నామని అన్నారు. బిసిలు తెగించి పోరాడకపోతే బానిస బతుకులు, బిక్షపు బతుకులు బతుకాల్సి వస్తుందని హెచ్చరించారు. బిసి కోటా కింద ఉద్యోగాలు వచ్చాయని ఈ కులాల నుంచి వచ్చినందున ఈ కులాల అభివృద్ధి కోసం పోరాడే సాంఘీక బాధ్యత భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమి లేవని ఆయనన్నారు.
రాజ్యాంగరపరమైన మండల్ కమిషన్ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందని తెలిపారు. కేంద్ర స్థాయి ఉద్యోగాలలో 54 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలుం ఉంటే బిసి ఉద్యోగులు కేవలం 7 లక్షల 50 వేల మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇది 14 శాతం ప్రాతినిధ్యం మాత్రమేనన్నారు. విద్యా, ఉద్యోగ నియామకాలలో బిసి రిజర్వేషన్లపై క్రిమిలేయర్ నిబంధన విధించిన తీరు బిసిలపై వివక్ష , చిన్నచూపు చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. క్రిమిలేయర్ బిసిలకే ఎందుకని ప్రశ్నించారు. ప్రమోషన్లలో బిసిలకు 50 శాతం కోటా కల్పించాలన్నారు. ఈ సమావేశంలో బిసి నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అంగిరేకుల వర ప్రసాద్ యాదవ్, అంజి, సుధాకర్, భూపేష్ సాగర్, నంద గోపాల్, రాజ్ కుమార్, వేముల రామకృష్ణ, రాందేవ్, నిఖిల్, గోవిందా తదితరులు పాల్గొన్నారు.